Kabul, August 31: తాలిబన్లు ఆక్రమించిన ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బలగాల ( US Troops ) ఉపసంహరణ నేటితో ముగిసింది. బలగాల ఉపసంహరణను పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ నెల 31వ తేదీలోగా బలగాల ఉపసంహరణ (US Leaves Afghanistan) పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి.
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించడంతో అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభమైంది. కాబూల్ నుంచి అర్ధరాత్రి బయల్దేరిన అమెరికా చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి ఉన్నారు. కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి విమానాశ్రయం తెరిచే ఉంచాలని బైడెన్ కోరారు. అమెరికా చివరి విమానం వెళ్లిన తర్వాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు. బలగాల ఉపసంహరణతో పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నెల 15వ తేదీన కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించిన విషయం విదితమే. ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రముఠాలకు స్థావరం కాకూడదని ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. తాలిబన్లు ఇతర దేశాలపై దాడులు చేయకూడదని తీర్మానించింది. తీర్మానం ఓటింగ్‌కు రష్యా, చైనా దూరంగా ఉన్నాయి.
అమెరికా 20 ఏళ్ల తర్వాత (After 20-Year Military Presence) ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి చివరి అమెరికా సైనికుడు కూడా కాబూల్‌ను వీడాడు. అయితే ఆ దేశం విడిచి వెళ్లే ముందు అక్కడ తాము విడిచి పెట్టిన అనేక ఎయిర్‌క్రాఫ్ట్, సాయుధ వాహనాలు, ఆయుధాలను అమెరికా సైనికులు పని చేయకుండా చేశారు వాళ్లు అలా వెళ్లిపోయారో లేదో కాబూల్ ఎయిర్‌పోర్ట్ హ్యాంగర్‌లోకి అడుగుపెట్టిన తాలిబన్లు అక్కడే ఉన్న చినూక్ హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విటర్‌లో షేర్ చేశారు.
Here's Video
#Taliban fighters enter a hangar in #Kabul Airport and examine #chinook helicopters after #US leaves #Afghanistan. pic.twitter.com/flJx0cLf0p
— Nabih (@nabihbulos) August 30, 2021
ఎన్నో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సాయుధ వాహనాలు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్‌లను అమెరికా సైన్యం పని చేయకుండా చేసినట్లు ఏఎఫ్‌పీ వెల్లడించింది. అయితే సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ ప్రకారం.. 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, 27 హమ్‌వీలను డీమిలిటరైజ్ చేశారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక ఎప్పటికీ ఎగరలేవు. ఎవరూ వాటిని వినియోగించలేరు అని మెకంజీ చెప్పారు. అమెరికా సైన్యం కాబూల్‌ను వీడే ముందు చేసిన అతి ముఖ్యమైన పని కౌంటర్ రాకెట్, ఆర్టిలరీ, మోర్టార్ వ్యవస్థను పని చేయకుండా చేయడమే. 70 ఎంఆర్ఏపీ సాయుధ వాహనాలను కూడా అమెరికా ఇక్కడే వదిలేసి వెళ్లింది. ఇది ఒక్కొక్కటి 10 లక్షల డాలర్ల విలువ చేసేది.
కాబూల్ విమానాశ్రాయాన్ని ఇప్పుడు తాలిబన్ ఫైటర్లు ( Taliban Fighters ) ఆక్రమించేశారు. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్.. ఎయిర్‌పోర్ట్‌లో ఫైటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా ఓటమి.. ఆక్రమణదారులకు గుణపాఠం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణలో ఓటమి పాలైన అమెరికాకు ఇదో పెద్ద గుణపాఠమని, భవిష్యత్తు తరాలకు కూడా ఆక్రమణదారులకు ఇదో లెసన్‌గా మిగిలుతుందని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఆర్మీ దస్తులు ధరించి ఆయుధాలతో ఉన్న ఫైటర్లను ఉద్దేశిస్తూ కాబూల్ విమానాశ్రయంలో జబీహుల్లా మాట్లాడారు. వారి త్యాగాలను ప్రశంసిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పారు. స్వాతంత్య్రాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. మీ పోరాటం, మన నేతల బలిదానం వల్లే ఈ విజయం సాధమైందని జబీహుల్లా తెలిపారు. మీకు, దేశ ప్రజలకు కంగ్రాట్స్ చెబుతున్నానని, మళ్లీ మన దేశాన్ని ఎవరూ ఆక్రమించరని భావిస్తున్నాని తెలిపారు. శాంతి, సామరస్యంతో పాటు నిజమైన ఇస్లామిక్ వ్యవస్థ ఏర్పాటు కావాలన్నారు.
ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వారికి ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమ పాలనలో కూడా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ చేతులు కలుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయని జబిహుల్లాను రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆ వార్తలు నిరాధారమైనవి అని కొట్టిపారేశారు. తాము భారతదేశానికే కాదు ఏ దేశానికి కూడా హానీ కలిగించము. తమ వైపు నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదు అని హామీ ఇస్తున్నట్లు జబీహుల్లా స్పష్టం చేశారు.