Washington, August 30: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్ దాడులు (Kabul Airport Attack) జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని వైట్ హౌస్ పేర్కొంది. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిని (Multiple rockets fired at Kabul airport) తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు.
సీ- ర్యామ్ డిఫెన్స్ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్ గన్ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇక అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణకు రేపటి(ఆగష్టు 31)తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది అఫ్గన్ ప్రజలతో పాటు 13 మంది అమెరికా సైనికులను బలిగొన్న ఐసిస్- కె(ఇస్లామిక్ స్టేట్- ఖోరసాన్) గ్రూపు మరోసారి దాడులకు తెగబడే అవకాశం ఉందని అగ్రరాజ్యం హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు దాడులు జరగడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.
సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. కాసేపటి తర్వాత వాటిని కూల్చేసిన శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. లాబ్ జార్ ఖైర్ఖానాలోని ఖోర్‌షిద్ ప్రైవేటు యూనివర్శిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. అయితే, రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న అఫ్గాన్ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం కూడా ఇలాంటి దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విమానాశ్రయానికి వాయవ్య దిశలో.. కేవలం ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిన్న కాబుల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది. నిన్న ఎయిర్‌పోర్టు వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా వారిని మట్టుబెట్టారు. ఇదిలా ఉండగా.. అఫ్గాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ రేపటితో ముగియనుంది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆగస్ట్ 31లోపు మొత్తం అమెరికా బలగాలను తరలిస్తామని బైడెన్ ( U.S. President Joe Biden) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తాలిబన్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ అమెరికా కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లక్షా 20 వేల మందిని తరలించింది. మంగళవారం చివరి అమెరికా విమానం అక్కడి నుంచి వెళ్లనుంది.