File image of parched land used for representational purpose | (Photo credits: PTI)

Kabul, August 29: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశం కావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. అంతర్జాతీయ సహకారంతో ఇప్పటిదాకా ముందుకు సాగుతూ వచ్చిన ఆ దేశం తాలిబన్ల రాకతో పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి (Afghanistan's Economic Crisis) కూరుకుపోయింది. ప్రపంచబ్యాంకుతో సహా పలు దేశాలు ఆప్ఘనిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిపివేశాయి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవు. ప్రజలకు ఆహారం లేదు. బ్యాంకుల్లో నగదు లేదు.

అఫ్గాన్‌లో (Afghanistan) కరవు కారణంగా 70 లక్షల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రతి ముగ్గురు అఫ్గాన్లలో ఒకరికి అత్యవసర ఆహార సాయం అందించాల్సి ఉందని పేర్కొంది. కరోనా వైరస్‌కు తోడు, ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అఫ్గాన్లకు తీవ్ర ఇక్కట్లు తప్పవని రోమ్‌ కేంద్రంగా పనిచేసే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) పేర్కొంది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ ఉత్పత్తులు 20% తగ్గుతాయి’’ అని ఎఫ్‌ఏవో అంచనా వేసింది.

24 గంటల్లో కాబూల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి, కచ్చితమైన సమాచారం ఉందని తెలిపిన అమెరికా అధ్యక్షుడు, విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ

దీనికి తోడు కరోనా మహమ్మారి, కరువు అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఫలితంగా అఫ్గానిస్థాన్‌ సంక్షోభం ముంగిట నిలిచింది. శనివారం కాబూల్‌లోని బ్యాంకు ఎదుట సివిల్‌ సర్వెంట్లు సహా వందలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అఫ్గాన్‌లో 3-6 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. బ్యాంకులు తెరుచుకున్నా వాటిల్లో నగదులేదు. ఏటీఎం విత్‌డ్రాపై పరిమితి విధించారు. దీంతో ఏటీఎంల ముందు భారీ లైన్లు కనబడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌లో కరువు కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20శాతం తక్కువ భూమి సాగు (Drought threatens farmers in Afghanistan) అవుతున్నది. ఈ ప్రభావం 70 లక్షల మందిపై పడొచ్చని ఐరాస హెచ్చరించింది. ప్రతీ ముగ్గురు అఫ్గాన్లలో ఒకరు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని ఇటీవల ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించింది.

ఉగ్రవాద సంస్థపై అమెరికా వేట, ఐసిస్ శిబిరాలే ల‌క్ష్యంగా డ్రోన్‌ల‌తో విరుచుకుపడిన అగ్రరాజ్యం, ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు

కాబూల్‌ ఎయిర్‌ పోర్టులో ఉగ్రవాద దాడులు జరిగి దాదాపు 200 మంది చనిపోయినా, మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించినా.. దేశం విడిచిపోవడం కోసం విమానాశ్రయానికి వచ్చేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నది. కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద ప్రజలు భారీగా గుమికూడకుండా విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు అదనపు బలగాలను మోహరించారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కొత్తగా మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కేవలం అమెరికా పాస్‌పోర్టు ఉన్నవారిని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి పంపిస్తున్నట్టు గతంలో అమెరికా బలగాలకు సాయం చేసిన ఓ వ్యక్తి చెప్పారు. తాలిబన్లు అతన్ని అడ్డుకొని వెనక్కు పంపించినట్టు పేర్కొన్నారు.

అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియ మంగళవారంతో పూర్తి కానున్నది. గడువు కంటే ముందే బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు తమ పౌరులను తరలించాయి. శనివారంతోనే తమ పౌరుల తరలింపును పూర్తి చేస్తామని ఫ్రాన్స్‌, స్పెయిన్‌ ప్రకటించాయి. అమెరికా కూడా ఈ నెల 31లోపే తమ వారిని రప్పిస్తామని చెప్తున్నది. కాబూల్‌ ఎయిర్‌పోర్టుపై మరోసారి దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు పౌరుల తరలింపులో అత్యంత ప్రమాదకరమైన దశ అని పేర్కొన్నది.