Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, కరవు మండలాల జాబితాను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, మొత్తం 5 జిల్లాల్లో 54 కరువు మండలాలు
ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.
Vjy, Oct 30: ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది.
కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదయ్యాయని ప్రస్తావించారు. 2023 ఖరీఫ్‌లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అదే 2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేపట్టారు.
రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు
అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల
అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.
చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.
కరువు మండలాలు
కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరు
అనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు
శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.
చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం.
(The above story first appeared on LatestLY on Oct 30, 2024 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

