Afghanistan: ఉగ్రవాద సంస్థపై అమెరికా వేట, ఐసిస్ శిబిరాలే ల‌క్ష్యంగా డ్రోన్‌ల‌తో విరుచుకుపడిన అగ్రరాజ్యం, ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు
Representational image (Photo: WikimediaCommons)

Washington, August 28: తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట (US Airstrike Targets ISIS ‘Planner’ in Afghanistan ) మొదలైంది. వెంటాడి.. వేటాడి మట్టుపెడతామని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది. కాబూల్ వ‌రుస పేలుళ్ల‌కు అమెరికా (America) ప్ర‌తీకారంగా కాబూల్‌లోని విమానాశ్ర‌యం వ‌ద్ద ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన ఐసిస్ శిబిరాలే ల‌క్ష్యంగా అమెరికా ద‌ళాలు డ్రోన్‌ల‌తో విరుచుకుప‌డ్డాయి. ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని నంగ‌హార్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావ‌రాల‌పై దాడి చేశామ‌ని సెంట్ర‌ల్ క‌మాండ్ కెప్టెన్ బిల్ అర్బ‌న్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు.

ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వెలుప‌ల నుంచి ఈ దాడి జ‌రిపిన‌ట్లు చెప్పారు. కాగా, కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల పౌరులు ఎయిర్‌పోర్టును ఖాళీ చేయాల‌ని అమెరికా హెచ్చ‌రించింది. గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద ఐసిస్-కే ఉగ్ర‌వాద సంస్థ వ‌రుస ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో 183 మంది మ‌ర‌ణించారు. ఇందులో 13 మంది అమెరికా ర‌క్ష‌ణ సిబ్బంది ఉండ‌గా, 169 మంది ఆఫ్ఘ‌న్ పౌరులు (Killed 169 Afghans) ఉన్నారు. మ‌రో 200 మంది గాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో దాడికి పాల్ప‌డిన‌వారు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ హెచ్చ‌రించారు. వారిపై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఐసిస్ నాయ‌కుల‌ను అంత‌మొందించాల‌ని సైన్యాన్ని ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం ప్ర‌తీకార దాడులు ప్రారంభించింది.

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 72 మంది దుర్మరణం మరియు వంద మందికి పైగా గాయాలు, తామే జరిపినట్లు ప్రకటించిన ఐఎస్, వెంటాడి.. వేటాడి పగ తీర్చుకుంటామన్న యూఎస్

ఐసిస్‌-కే గ్రూపు లక్క్ష్యంగా శుక్రవారం ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. అఫ్గన్‌ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్‌ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్‌ అయినట్లు వైట్‌ హౌజ్‌ దళాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు కాబూల్‌ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది.

ఇంకోవైపు ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగారు. మరిన్ని దాడులకు ఐసిస్‌-కే పథక రచన చేస్తుందన్న సమాచారం మేరకు తాలిబన్‌ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు కాబూల్‌లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్ బలగాలు.. ఇప్పటికే ఐసిస్-కే సానుభూతిపరులు, మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ద్వారా దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.