Polio Paul Dies: పోలియో పాల్ ఇక లేరు, ఇనుప ఊపిరితిత్తులతో ప్రసిద్ధికెక్కిన పోలియో వ్యాధి బాధితుడు పాల్ అలెగ్జాండర్ కన్నుమూత, ఎలా చనిపోయాడు? పూర్తి వివరాలు చదవండి!
Polio Paul Dies: అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలియాస్ పోలియో పాల్ కన్నుమూశారు. ఇనుప ఊపిరితిత్తుల లోపల దాదాపు 70 సంవత్సరాలు గడిపిన ఆయన, 78 సంవత్సరాల వయస్సులో మరణించారు. పాల్ మృతిని ఆయన సంరక్షణ బాధ్యతలు చూసుకొనే ఒక ఎన్జీఓ సంస్థ ధృవీకరించింది. పాల్ అలెగ్జాండర్ 2024 మార్చి 11న, సోమవారం మరణించాడని మంగళవారం (మార్చి 12) GoFundMe పేజీలో నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. "పాల్ అలెగ్జాండర్- ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్ ఇక లేరు" అని పేర్కొన్నారు.
1946వ సంవత్సరంలో జన్మించిన పాల్ అలెగ్జాండర్, ఆరేళ్ల వయస్సులో ఉండగా భయంకరమైన పోలియో వైరస్ మహమ్మారి బారినపడ్డాడు. పోలియో వ్యాధి కారణంగా ఆయన శరీరం చాలా తీవ్రంగా దెబ్బతింది. మెడ నుండి కాళ్ల వరకు పక్షవాతానికి గురయ్యాడు, ఆయన స్వయంగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాడు. లక్షణాలు తీవ్రం అవుతుండటంతో ఆయనను టెక్సాస్‌లోని ఆసుపత్రికి తరలించారు.
అతడు నిద్రలేచి చూసే సరికి మెడ నుంచి కాళ్ల వరకు అతడి శరీరం పూర్తిగా కప్పి ఉంచిన ఒక ఇనుప కవచంలో ఉన్నాడు, కేవలం మెడ భాగం మాత్రమే బయటకు కనిపించేది. ఇది 1952 నాటి సంఘటన, అప్పుడు అతడి వయసు ఆరేళ్లు మాత్రమే. అప్పట్నించీ అతడు ఆ ఇనుప ఊపిరితిత్తుల జీవితంలోనే బందీ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు 'పోలియో పాల్' గా, 'ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్' గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కారు.
పాల్ శరీరాన్ని కప్పి ఉంచే ఆ ఇనుప కవచం. ఒక కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలా పనిచేస్తుంది. కృత్రిమంగా ఆక్సిజన్ సరఫరా చేసి శ్వాసను అందిస్తుంది. దీనినే మనం ఈరోజుల్లో వెంటిలెటర్ అంటున్నాము. నేడు కృత్రిమ శ్వాస అందించే అత్యంత అధునాతన వెంటిలేటర్లు, ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ పాల్ మాత్రం ఆ ఇనుప కవచానికే అలవాటు పడ్డాడు. 2015 లో దానికి రంధ్రాలు పడినప్పటికీ, మరమత్తులు చేసుకుంటూ ఉపయోగిస్తూ వచ్చాడు. పాల్ స్వతహాగా గాలిపీల్చేలా వైద్యులు ఆ కొన్నిసార్లు ఆ ఇనుప కవచం తొలగించే ప్రయత్నాలు చేసినపుడు అతడు వెంటనే సృహ కోల్పోయేవాడు, అందుకే వైద్యులు దానినే కొనసాగించడానికి అనుమతించారు.
పోలియో పాల్ జీవితం స్ఫూర్థి దాయకం
అలెగ్జాండర్ పాల్ 1952 నుంచి తాను చనిపోయేంత వరకు, అంటే 2024 వరకు ఆ ఇనుప కవచంలో బ్రతికాడు. ఇలా 72 ఏళ్ల పాటు కదలకుండా ఆ ఇనుప కవచంలోనే ఉండటం నిజంగా ఒక అద్భుతం, అసాధారణ విషయం అనే చెప్పాలి.
అయితే పాల్ జీవితం కూడా ఎంతో స్ఫూర్థిదాయకమైనది. తాను కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన ఆ పరిస్థితుల్లోనే యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు, న్యాయ విద్య పూర్తి చేసి లాయర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రత్యేకమైన వీల్ చైర్ సహాయంతో కోర్టులో వాదనలు సైతం వినిపించారు. అంతేకాదు 'త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్: మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లంగ్' పేరుతో తన సొంత ఆటో బయోగ్రఫీని రాసుకొని దానిని పుస్తకరూపంలో ప్రచురించారు కూడా.
చిన్న వికలాంగ సమస్య ఉంటేనే చాలా మంది తమ బ్రతుకు వ్యర్థం అనుకుంటారు, ఏ పని చేయకుండా ఉండాలనుకుంటారు. కానీ పాల్ మాత్రం జీవితంపై ఆశను కోల్పోలేదు. తన శరీరం పూర్తిగా తనకు సహకరించకపోయినా, కేవలం తన శరీరంలో పనిచేసే ఏకైక భాగమైన తలనే పుర్తి స్థాయిలో పనిచేయించారు. దృఢ సంకల్పంతో జీవితంలో అనుకున్నది సాధించారు, 78 ఏళ్లు జీవించి ప్రపంచంలో ఎంతో మందికి ఒక రోల్ మోడల్ అనిపించుకున్నారు.