Iran vs USA: ఇరాన్ దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదు, అమెరికా బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, ఇక ముందు ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడి

ఆయిల్ మరియు సహజ వాయువు ఉత్పత్తిలో యూఎస్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. చమురు కోసం తమకు మధ్యప్రాచ్యంపై అవసరమే లేదని పేర్కొన్నారు...

US President Donald Trump (Photo Credits: ANI)

Washington DC, January 9: ఇరాక్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై బుధవారం జరిపిన క్షిపణి దాడిలో 80 మంది అమెరికా సైనికులు హతమయ్యారన్న ఇరాన్ వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తోసిపుచ్చారు. వైట్ హౌజ్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ (Iran) చేసిన దాడుల్లో ఒక్క అమెరికన్ సైనికుడు చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలు మినహా, ఎవరికీ ఏ హాని జరగలేదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా (America) ఇప్పటికీ శాంతిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఒకవేళ ఇరాన్ ఇంకా దాడులకు పాల్పడితే అమెరికా బలగాలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా ఇప్పటికే హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేస్తుంది. అంతేకాకుండా ఘనమైన సైనిక మరియు ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. కానీ, తమ శక్తిని ఎవరిపై ఉపయోగించాలని మేము అనుకోవడం లేదని ట్రంప్ చెప్పారు. సులేమానిని ఎప్పుడో చంపాల్సింది, కానీ అది ఇప్పుడు జరిగింది. జీవితంపై ఆశ ఉంటే తమపై దాడులు చేయొద్దనే సందేశాన్ని పంపాం అని ట్రంప్ అన్నారు.  ప్రతీకార దాడిలో 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' హతం అయ్యారని పేర్కొన్న ఇరాన్ స్టేట్ మీడియా

ఇక ముందు ఇరాన్‌పై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఇరాన్ ముందుందని పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు, ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని ఎప్పటికీ అనుమతించను ట్రంప్ తేల్చి చెప్పారు.

Donald Trump Speech

చమురు సరఫరా గురించి తమ దేశం ఎంతమాత్రం ఆందోళన చెందడం లేదని అన్నారు. ఆయిల్ మరియు సహజ వాయువు ఉత్పత్తిలో యూఎస్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పారు. చమురు కోసం తమకు మధ్యప్రాచ్యంపై అవసరమే లేదని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇరాన్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుంది. ఇది ఆ దేశంతో పాటు ప్రపంచానికి మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని సురక్షితమైన, శాంతియుతమైన ప్రదేశంగా మార్చడానికి అందరూ కృషి చేయాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.