UK Elections Results 2024: యూకే ఎన్నికల్లో కీర్‌ స్టార్మర్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం, 14 ఏళ్ళ తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీకి ఘోర పరాభవం, సారీ చెప్పిన రిషి సునాక్

14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన రిషి సునాక్ నేతృత్వంలోని పార్టీ భారీ ఓటమిని మూటగట్టుకుంది.

Keir Starmer and Rishi Sunak (photo-ANI)

UK, July 5: బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి (Conservative Party)కి ఘోర పరాభవం ఎదురైంది. 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన రిషి సునాక్ నేతృత్వంలోని పార్టీ భారీ ఓటమిని మూటగట్టుకుంది. కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఓటమిపై భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు.

ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని బ్రిటన్‌ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా’ అని సునాక్‌ తెలిపారు.  యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. కైర్ స్టార్మర్ నేతృత్వంలోని 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ మెజారిటీ 410 సీట్లను గెలుచుకుంది. రిషి సునక్ పార్టీ కేవలం 117 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ (SNP) 8 సీట్లు గెలుచుకోగా, లిబరల్ డెమోక్రాట్లు 70 సీట్లు గెలుచుకున్నారు. ఇక SF 7 సీట్లు గెలుచుకోగా ఇతరులు 26 సీట్లలో గెలుపొందారు.

అధికారిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ లేబర్ 410 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది, 1997లో టోనీ బ్లెయిర్ ఘన విజయం సాధించిన తర్వాత అత్యధికంగా 170 మెజారిటీతో గెలుస్తుందని అంచనా వేసింది. గత ఆరు UK ఎన్నికలలో, ఒక ఎగ్జిట్ పోల్ మాత్రమే ఫలితాన్ని తప్పు పట్టింది. కాగా మేలో, రిషి సునక్ తన స్వంత పార్టీలో చాలా మందిని ఆశ్చర్యపరుస్తూ ముందస్తు ఎన్నికలకు సై అన్నారు.

త 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్‌ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి.

ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రసంగించారు. బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘మీ అందరికి కృతజ్ఞతలు. మన దేశాన్ని మీరు మార్చారు. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచింది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడదాం’’ అని పిలుపునిచ్చారు.

బ్రిటన్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో అది 67 శాతంగా ఉన్నది.