Ukraine Dam Burst: ఉక్రెయిన్‌లో కీలక డ్యామ్‌ను పేల్చేసిన రష్యా, వరద ముంపులో 42 వేల మంది ప్రజలు, ఘటనను మానవహనన పర్యావరణ బాంబుగా అభివర్ణించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ దేశంలో అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది.
కీవ్, జూన్ 7: ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ దేశంలో అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని దిగువ ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. ఈ వరద ప్రవాహం ధాటికి దాదాపు 42 వేల మంది వరద ముంపులో ఉన్నట్లు తేలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని అధికారులు ఖాళీ చేయించారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లాలంటే నీపర్ నదిపై ఉన్న ఈ డ్యాం అత్యంత కీలకం అని చెప్పవచ్చు.
అందువల్లే ఆనకట్టను కూల్చేశారని వార్తలు వెలువడ్డాయి. ఆనకట్ట కూల్చివేతను రష్యా అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, క్రీమియా ఆక్రమణపై ద హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. డ్యామ్ పేల్చివేత వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూఎన్ చీఫ్ హెచ్చరించారు.
ఇది రష్యా పనే అని ఉక్రెయిన్ మిలటరీ కమాండ్ ఆరోపించగా.. ఆక్రమిత ఉక్రెయిన్‌లోని రష్యా అధికారులు మాత్రం ఇది ఉగ్రదాడి అని చెబుతుండటం గమనార్హం.దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని ఈ డ్యామ్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని రోజులుగా ఈ డ్యామ్‌కు సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రం (Kakhovka hydropower plant )లో భాగంగా దీన్ని నిర్మించారు. ఈ డ్యామ్ 30 మీటర్ల ఎత్తు.. 3.2 కిలోమీటర్ల పొడవు ఉంది. అమెరికాలోని ఉటాలో గల గ్రేట్ సాల్ట్ లేక్‌కు సమానమైన నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోవియేట్ కాలం నాటి నోవా కఖోవ్కా డ్యామ్‌ను హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్‌గా వాడుతున్నారు.
రష్యా ఆక్రమణదారులు కావాలనే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్‌ను పేల్చివేశారని, ఇది మానవహనన పర్యావరణ బాంబుగా జెలెన్‌స్కీ అభివర్ణించారు. నిన్న రాత్రి ఇచ్చిన వీడియో సందేశంలో జెలెన్‌స్కీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్యామ్‌ను కూల్చినంత మాత్రాన తమను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.కఖోవ్కా రిజర్వాయర్‌లోని నీరును రైతులకు, నివాసితులకు సరఫరా చేస్తారు.
జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌కు కూడా ఇక్కడ నుంచే నీరు వెళ్తుంది. రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతానికి కూడా ఈ డ్యామ్ నుంచే నీళ్లు వెళ్తాయి. డ్యామ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేర్సన్ సిటీ నీటితో నిండిపోయింది. అక్కడ నీటి స్థాయి 3.5 మీటర్లకు పెరిగింది. మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో స్థానికులు గ్రామాల్ని వీడుతున్నారు. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రజల్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.