US Capital Violence: డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుల అరాచకం, యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు, అల్లర్లలో నలుగురి మృతి, అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు

అయినప్పటికీ ఆ ఆదేశాలను కొంత మంది పాటించలేదు, దీంతో వాషింగ్టన్ డీసీలో 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.....

Violence at Capitol Building (Photo Credits: ANI)

Washington D.C, January 7: అమెరికాలో ఇటీవల జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పై ఆయన ప్రత్యర్థి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే, తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ మరియు ఆయన మద్ధతుదారులు జో బిడెన్ ను నిలువరించేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా వారి చేష్టలు శృతిమించి అమెరికాలో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి.

జో బిడెన్ ఎన్నికల విజయాన్ని ధృవీకరించడానికి యూఎస్ కాంగ్రెస్, వాషింగ్టన్ డీసీలో గల క్యాపిటల్ భవనంలో బుధవారం (యూఎస్ కాలమానం ప్రకారం) సమావేశం అయింది. దీనిని అడ్డుకునేందుకు క్యాపిటల్ భవనం లోపలికి పెద్ద సంఖ్యలో దూసుకెళ్లిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు గందరగోళం సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించింది, ఈ క్రమంలో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు కాల్పులు జరపగా ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. ఘర్షణల్లో మరో ముగ్గురు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో యూఎస్ క్యాపిటల్ భవనం ఎదుట పరిస్థితులు భీతావహంగా మారాయి.

Trump supporters protest:

కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీ మేయర్ నగరంలో కర్ఫ్యూ విధించారు, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను కొంత మంది పాటించలేదు, దీంతో వాషింగ్టన్ డీసీలో 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 52 మందిని అరెస్ట్ చేశారు. కాగా, వీరిలో 47 మంది కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారే కావడం గమనార్హం. ఉద్రిక్తతల నడుమే యూఎస్ కాంగ్రెస్ సమావేశం క్యాపిటల్ భవనంలో కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ట్రంప్ మద్ధతుదారులు ఇందుకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

కాగా,  1812లో యుద్ధంలో బ్రిటిష్ వారు కాపిటల్ భవనానికి నిప్పుపెట్టిన నాటి నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తడం ఇదే మొదటిసారి అని అమెరికా చరిత్రకారులు పేర్కొన్నారు.

ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగడానికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్యాపిటల్ హింసా ఘటనల నేపథ్యంలో తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ కేబినెట్ సమావేశమవుతున్నట్లు సమాచారం.