Afghanistan Crisis: ఇంకా మా బిడ్డలు బలవ్వాలా..అమెరికా ప్రజలపై దాడి చేస్తే తాలిబన్లకు వినాశనమే, అమెరికా-నాటో దళాల ఉపసంహరణ సరైన నిర్ణయమేనని తెలిపిన జోబైడెన్, తప్పంతా ఆప్ఘనిస్తాన్ సైనికులదేనని తెలిపిన అగ్రరాజ్య అధినేత
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై (US President Joe Biden) అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది
Washington, August 17: ఆఫ్గనిస్థాన్‌లో అమెరికా-నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు ఆ దేశాన్నిఆక్రమించుకున్న (Afghanistan Crisis) సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై (US President Joe Biden) అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు.అఫ్ఘన్ నుంచి బలగాల (US Troops) ఉపసంహరణను సమర్థించుకున్నారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదు. అమెరికా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం. రెండోది.. మూడో దశాబ్దంలోనూ మరింత సైన్యాన్ని పంపి.. మోహరింపు కొనసాగించడం. రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనే భావిస్తున్నాం అని బైడెన్ వెల్లడించారు. ఆఫ్ఘానిస్థాన్‌లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని ఈ సందర్భంగా బైడెన్ స్పష్టం చేశారు.
20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో ఆల్‌ఖైదాను అంతం చేశాం. బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు మేం వెనక్కి తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా అఫ్గన్ సైన్యానికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనోధైర్యం అందించాం. కానీ, వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతమమైంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అవసరమైతే అప్ఘన్ ఉగ్రవాదంపై పోరాటం చేస్తాం. అఫ్గన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బైడెన్ తేల్చి చెప్పారు.అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు.
మరోవైపు తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన బైడెన్.. అఫ్గన్ నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని, అమెరికా సైన్యానికి సాయం చేసిన అఫ్గన్ ప్రజలను సైతం అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టం చేశారు. 9/11 ఘటన ఆర్వాత అల్ ఖైదాతో సంబంధాల కోసం తాలిబన్లను శిక్షించే దాని ప్రారంభ లక్ష్యాలకు మించి విస్తరించిన యుద్ధాన్ని ఆపడమే ప్రాధాన్యం అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కేంద్రీకృత ప్రజాస్వామ్యం నిర్మించడం తమ లక్ష్యం కాదన్నారు. శాశ్వత సైనిక ఉనికి లేని దేశాల్లో ఉగ్రవాదంపై పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. తాలిబాన్లు మళ్లీ దాడులను ప్రారంభిస్తే ‘వినాశకరమైన’ సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిణామాలు.. విచారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్గాన్‌లో అమెరికా బలగాలను ఇంకా ఉంచాల్సిందని వాదిస్తున్నవారిని నేను ఒకే ప్రశ్న అడగదలుచుకున్నా.. అఫ్గానిస్థాన్ సైనికులే (Joe Biden Blames Afghanistan Leaders) వారి సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో పోరాడడం లేదు. అలాంటి యుద్ధంలో పోరాడడానికి ఇంకా ఎన్ని తరాల అమెరికా బిడ్డలను పంపమంటారు?’’ అని బైడెన్ ప్రశ్నించారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను నాలుగో అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని ఐదో అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనన్నారు. 2009లో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అఫ్గాన్‌లో సైనిక దళాలను మోహరించడంపై వ్యతిరేకించినట్లు తెలిపారు. తాను అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదన్నారు.
కాబుల్ విమానాశ్రయంలో అఫ్గాన్ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విమానాల టైర్లపై ఎక్కి ప్రయాణించి మరణించారు. ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై బైడెన్ స్పందిస్తూ ఈ దృశ్యాలు తనను కలచివేశాయన్నారు. అఫ్గాన్ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. అఫ్గాన్ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్ అన్నారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్ డాలర్లను అందించామని.. ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయన్నారు.
అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ దేశ రాజధాని కాబుల్‌ను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. మరోవైపు దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తి విమానాల్లో ఇతర దేశాలకు వెళ్లారు.