Ather Halo- Smart Helmet: ఏథర్ హాలో.. ఇది సాధారణ హెల్మెట్ కాదు, చాలా స్మార్ట్ హెల్మెట్.. మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, మరెన్నో ప్రత్యేకతలు, దీని ధర ఎంతో తెలుసా?
Ather Smart Helmets: ద్విచక్ర వాహనం నడిపే వారికి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిసిందే. అనుకోకుండా సంభవించే ప్రమాదాల వలన ప్రాణాపాయం కలగకుండా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయినప్పటికీ చాలా మంది సిల్లీ కారణలతో హెల్మెట్ ధరించడాన్ని భారంగా భావిస్తారు. కానీ, ఇలాంటి ఒక హెల్మెట్ ఉంటే నడుచుకుంటూ వెళ్లేటపుడు కూడా హెల్మెట్ ధరిస్తారు కావచ్చు. ఎందుకంటే ఇది అట్టాంటి ఇట్టాంటి హెల్మెట్ కాదు, ఇది చాలా స్మార్ట్ హెల్మెట్.
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఏథర్ ఎనర్జీ ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్‌లను తయారు చేయడం కూడా ప్రారంభించింది. తాజాగా రెండు స్మార్ట్ హెల్మెట్ వేరియంట్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 'హాలో' అనబడే హెల్మెట్ మోడల్ మొత్తం ముఖాన్ని కవర్ చేస్తుంది. మరొకటి ముఖాన్ని పాక్షికంగా కవర్ చేసే హాఫ్-ఫేస్ హెల్మెట్. హాలో హెల్మెట్‌కు అనుసంధానంగా 'హాలో బిట్' అనే మాడ్యూల్ కంట్రోలర్ కూడా ఉంటుంది.
Ather Halo Smart Helmet Features- ఏథర్ హాలో ఫీచర్లు
ఏథర్ రూపొందించిన స్మార్ట్ హెల్మెట్ 'హాలో' లో ఆటో వేర్‌డెటెక్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది బ్లూటూత్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటితో ఏకకాలంలో కనెక్ట్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఫుల్-ఫేస్ హెల్మెట్‌లో రెండు హర్మాన్ కార్డాన్ స్పీకర్‌లు ఉంటాయి, ఇవి బయటి రణగొన ధ్వనులను ఫిల్టర్ చేస్తాయి. రైడర్ పూర్తి ఏకాగ్రతతో బైక్ నడపవచ్చు, అంతేకాకుండా కారులో వింటున్నట్లుగా హై-క్వాలిటీ మ్యూజిక్‌ను వినవచ్చు, రోడ్డు సూచనలను, ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకోవచ్చు.
ఈ హాలో హెల్మెట్‌ను ఏథర్ స్కూటర్‌కి కనెక్ట్ చేసిన తర్వాత, రైడర్ హ్యాండిల్‌బార్ బటన్‌లను ఉపయోగించి మ్యూజిక్ మరియు కాల్‌లను ఆపరేట్ చేయవచ్చు. మరొక ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే, ఈ స్మార్ట్ హెల్మెట్‌లో చిట్‌చాట్ సాంకేతికత కూడా ఉంది, ఇది రైడర్ తన వెనక కూర్చున్న వ్యక్తితో చాలా సులభంగా కమ్యూనికేట్ చేయటానికి అనుమతిస్తుంది. అయితే ఇద్దరూ ఇలాంటి హెల్మెట్స్ ధరిస్తే ఫోన్ లో మాట్లాడుతున్నట్లుగా వెనక వ్యక్తితో మాట్లాడుకోవచ్చు.
ఈ హెల్మెట్‌ను ఛార్జ్ చేయడం కూడా సులభం. స్కూటర్ బూట్ స్పేస్ లోనే నిల్వ చేయగల వైర్‌లెస్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. ఈ హెల్మెట్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే, దాదాపు ఒక వారం పాటు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది.
Ather Halo Smart Helmet Price - ధర ఎంత?
ఏథర్ స్మార్ట్ హెల్మెట్, హాలో మరియు హాలో బిట్ రెండు విడి భాగాలుగా ఉంటుంది. హలో బిట్ పైన బటన్స్ ఉంటాయి. ఇది కంట్రోలర్ మాడ్యూల్ లాగా పనిచేస్తుంది. ఇందులో హాలో ధర రూ. 14,999/- కాగా, హాలో బిట్ ధర రూ. 4,999/- గా నిర్ణయించారు. ఈ రెండూ విడిభాగాలు కలిపి రూ. 20,000 వేలు. అయితే, ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా రూ. 2 వేలు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ హెల్మెట్‌లు ISI మరియు DOT ఆమోదం కూడా పొందాయి.