Ola layoffs (Photo-Twitter Pixabay)

దేశంలోని ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) 5 నెలల వ్యవధిలోనే రెండోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఇప్పటికే నష్టాలతో సతమతమవుతోన్న కంపెనీ పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిన పోటీ, నియంత్రణ పరిశీలన, నిర్వహణ వ్యయాలతో కంపెనీకి సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.నష్టనివారణ చర్యల్లో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

ప్రొక్యూర్‌మెంట్‌, కస్టమర్ రిలేషన్స్‌, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు వార్తల తర్వాత ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు కూడా 5 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.గతేడాది నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. 2024 మార్చి నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 4,000 మంది ఉద్యోగులు ఉండగా ఇందులో నాలుగో వంతుకు పైగా తాజా తొలగింపుల ప్రభావానికి గురికానున్నారు. అయితే కంపెనీ బహిరంగ వెల్లడిలో భాగం కాని కాంట్రాక్ట్ కార్మికులను చేర్చడం వల్ల ఖచ్చితమైన ప్రభావం అస్పష్టంగా ఉంది.

ఆగని లేఆప్స్, 1200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న బెల్, టెలికాం పరిశ్రమలో ఒడిదుడుకులే కారణం

కాగా డిసెంబర్ త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నష్టాలు 50% పెరిగాయి. ఆగస్టు 2023 లో బలమైన ఐపీఓ అరంగేట్రం తరువాత కంపెనీ స్టాక్ గరిష్ట స్థాయి నుండి 60 శాతానికి పైగా పడిపోయింది. ఉద్యోగుల తొలగింపు వార్తలు కంపెనీ షేరును మరింత ప్రభావితం చేశాయి. ఇది 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకింది. వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ డేటా ప్రకారం 2023 చివరి నాటికి దేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో తొమ్మిదింటిలో ఓలా ఎలక్ట్రిక్ తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది.ఒకప్పుడు భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలవుతోంది.

డిసెంబర్ లో బజాజ్ ఆటో లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ గా టీవీఎస్ మోటార్ కంపెనీ తరువాత మూడవ స్థానానికి చేరుకుంది. ఇక తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి, తన పరిధిని విస్తరించడానికి, సర్వీస్ నాణ్యత గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కంపెనీ ఇటీవల 2023 డిసెంబర్‌లో 3,200 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభించింది.