Yamaha RX100 Relaunch: రయ్ రయ్ మని దూసుకుపోయి యూత్ గుండెల్లో నిద్రిస్తున్న ఆనాటి క్రేజీ 'ఆర్ఎక్స్100' బైక్.. ఆధునిక హంగులతో పునారగమనం చేయబోతుంది, కొత్త బైక్ ధర అంచనాలు ఇలా ఉన్నాయి!
Yamaha RX100 To Yamaha RX225: యమహా ఆర్ఎక్స్ 100 బైక్ అంటే ఒకప్పుడు యూత్ లో యమ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా దాని స్టైలిష్ డిజైన్, బైక్ నుంచి వచ్చే రయ్ రయ్ మనే శబ్దం అంటే ఎంతో మందికి చాలా ఇష్టం. అయినప్పటికీ కొన్ని కారణాల వలన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ కనుమరుగైపోయింది. కానీ, నేటికీ కూడా ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఈ బైక్ పునారగమనంపై కొన్ని నెలల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆ వార్తలు నిజమేనని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఇండియాలో ఆర్ఎక్స్ 100కు ఉన్న క్రేజ్ ను, బైక్ ప్రేమికుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జపాన్ కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు యమహా, తమ మోస్ట్ వాంటెడ్ RX100 బైక్‌ను భారత మార్కెట్లో రీలాంచ్ చేయడంపై అడుగులు వేస్తుంది.
నివేదికల ప్రకారం, యమహా తన ఐకానిక్ RX100ని మరింత పెద్దదైన ఇంజన్‌తో పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
రాబోయే బైక్ ఇంజిన్ శక్తివంతమైన 225.9cc సామర్థ్యంను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 20.1 bhp పవర్ అవుట్‌పుట్ మరియు 19.93 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఈ ఇంజన్ BS6 ఫేజ్ 2 యొక్క కఠినమైన ఉద్గార అవసరాలను తీర్చేలా రూపొందిస్తున్నట్లు రిపోర్టుల్లో పేర్కొన్నారు. ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా యమహా తన బైక్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కొత్త బైక్‌లో RX నామకరణం ఉంటుంది, అదే తరహా క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. కానీ యమహా RX100కి బదులుగా RX225 అని ఉండవచ్చు. అంచనాల ప్రకారం, యమహా RX225 బైక్ ధరలు భారత మార్కెట్లో రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల మధ్య ఉండవచ్చు. అయితే దీని గురించి యమహా ఇంకా ఏమీ ధృవీకరించలేదు.
అయితే, యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా మాట్లాడుతూ భారతీయ రోడ్లపై RX100 మళ్లీ కనిపిస్తుందని పేర్కొన్నారు. RX100 దాని ప్రస్తుత మోనికర్‌ను అనగా పాత పేరును అలాగే ఉంచుతుందని తెలిపారు. దాని స్థానంలో మరో మోటార్ సైకిల్ ఉండదని చెప్పడం గమనార్హం.
1980లో పరిచయం అయిన యమహా RX100 బైక్ అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలలో ఒకటి. 1985 నుండి 1996 వరకు టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. ఆ తర్వాత 2005 వరకు దాని యొక్క వివిధ పునరావృతాలను ప్రవేశపెట్టింది. అయితే భారత ప్రభుతం దేశంలో కఠినమైన ఉద్గార నిబంధనలు అమలు చేస్తూ టూ-స్ట్రోక్ మోటార్‌సైకిళ్ల విక్రయాన్ని నిలిపివేసింది. తదనంతరం, యమహా కంపెనీ RX100 బైక్‌ను నిలిపివేసింది.