Stock Market Crash: 12 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనావైరస్ భయాందోళనలతో మార్కెట్లు పతనం, 2,919 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 10 వేల దిగువనకు నిఫ్టీ
బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు కుప్పకూలాయి. కనీసం 10 శాతం పతనం చూశాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, మహింద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.....
Mumbai, March 12: ప్రపంచ ఆరోగ్య సంస్థ నోవెల్ కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus) "మహమ్మారి" గా (Pandemic) ప్రకటించిన తరువాత అంతర్జాతీయంగా మార్కెట్లు పతనమవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ (Sensex) 2,919 పాయింట్లు నష్టపోయి 32,778 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 868 పాయింట్లు నష్టపోయి 9,590 వద్ద ముగిసింది. గురువారం సెన్సెక్స్ సుమారు 8.18 శాతం పతనమైంది.
నివేదిక ప్రకారం సుమారు 12 లక్షల కోట్ల (రూ. 11,83,031.96 కోట్లు) ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
గురువారం మార్కెట్లు 52 వారాల కనిష్ఠ స్థితిని చూశాయి. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు కుప్పకూలాయి. కనీసం 10 శాతం పతనం చూశాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, మహింద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
ఒక దశలో సెన్సెక్స్ 3 వేల పాయింట్ల పైగా నష్టాల వద్ద సూచించింది. మార్చి 26, 2018 తర్వాత నిఫ్టీ సూచిక 10 వేల దిగువకు చేరడం ఇదే తొలిసారి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ 74.20 వద్ద ప్రస్తుతం ఉంది.
రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 119,400 కు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,300 దాటింది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై కరోనావైరస్ ప్రభావం కనబడుతోంది. అమెరికా వాల్ స్ట్రీట్ స్టాక్స్ బుధవారం భారీగా పతనమైనాయి. స్వీయ నిర్బంధం విధించుకున్న భారత్, ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలు రద్దు
ప్రపంచ అంటువ్యాధిగా కరోనావైరస్ గుర్తించబడిన తర్వాత అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 రోజుల పాటు అమెరికా- యూరప్ మధ్య అన్ని ప్రయాణాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈ శుక్రవారం అర్ధరాత్రి నుండి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపారు.