Coronavirus in India- Quarantine Period | PTI Photo

New Delhi, March 12:  కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus Spread) ప్రపంచంలోని 114 దేశాలకు పైగా పాకింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  కోవిడ్-19ను 'ప్రపంచ అంటువ్యాధి' (Global Pandemic) గా గుర్తిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో దేశంలో కరోనావైరస్ రాకుండా భారత్ స్వీయ నిర్భంధం విధించుకుంది. కొన్నాళ్ల పాటు ఇండియా నుంచి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా, విదేశాల నుండి ఎవరూ ఇండియా రాకుండా టూరిస్ట్ వీసాలను (Indian Visas) రద్దు చేసింది. ఏప్రిల్ 15 వరకు వీసా జారీల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 13 నుంచి ఇది అమలులోకి వస్తుందని సమాచారం ఇచ్చింది.

అయితే దౌత్య పరమైన, అధికారిక కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలకు, ఉపాధి లేదా ప్రాజెక్ట్ పనుల మీద వెళ్లే వారికి జారీ చేసే వీసాలకు మినహాయింపునిచ్చింది. వీరికి తప్ప ఇప్పటికే జారీ చేయబడిన మిగతా అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా, గత నెల ఫిబ్రవరి 15 తర్వాత ఎవరైతే ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు జర్మనీ దేశాల నుండి వచ్చిన వారున్నారో, ఆ ప్రయాణికులందరినీ కనీసం 14 రోజుల పాటు 'నిర్బంధం'లో ఉంచనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిబంధన భారతీయులతో పాటు విదేశీయులకు వర్తిస్తుందని పేర్కొంది.

వీసా రహిత ప్రయాణ సౌకర్యం కార్డు హోల్డర్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.  ఇది మార్చి 13, 2020 ఉదయం 12 AM నుండి అమల్లోకి వస్తుంది, ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా అయిన భారత్ నుంచి విదేశాలకు రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి.

కరోనా ప్రపంచదేశాలకు విస్తరించడం, భారత్ లోనూ ఇప్పటికే 60కి పైగా కేసులు నమోదవడం. ఎక్కువ సంఖ్యలో విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో కొంత మంది కేంద్ర మంత్రుల బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.