K Viswanath Passed Away: కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు

K Viswanath (PIC @ twitter)

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు,  కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  కె. విశ్వనాథ్ శంకరాభరణం చిత్రం ద్వారా సినీ ప్రపంచంలో వెలుగు వెలిగారు. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చిత్రాలకు గణనీయమైన కృషి చేశారు. దర్శకుడిగానూ, నటుడిగానూ, ఆయన పేరు పొందారు.  విశ్వనాథ్ చెన్నైలోని ఒక స్టూడియోలో టెక్నీషియన్‌గా తన సినీ కెరీర్  ప్రారంభించాడు. తరువాత శ్రీ. ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. దర్శకుడు రాంనాథ్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పనిచేశాడు. అలాగే కె.బాలచందర్, బాపుల వద్ద సహాయకుడిగా పనిచేయాలని ఆకాంక్షించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ తొలిసారి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఆయన పూర్తి నైపుణ్యం సిరి సిరి మువ్వ అనే సినిమా ద్వారా వికసించింది. శంకరాభరణం సినిమా ఆయన ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించేలా చేసింది. స్వాతి ముత్యం 1986లో ఆస్కార్‌ పురస్కారానికి భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా గుర్తింపు పొందింది. నటుడిగానూ ఆయన సినిమాల్లో రాణించారు. తండ్రి, తాత పాత్రల్లో విశ్వనాథ్ చెరగని ముద్ర వేశారు.

విశ్వనాథ్ కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు, వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన సర్గం, జాగ్ ఉఠా ఇన్సాన్, ఈశ్వర్, ధన్వాన్. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం తెలుగులో అల్లరి నరేష్ , మంజరి ఫడ్నీస్ నటించిన శుభప్రదం కావడం విశేషం.

తెలుగు చిత్రసీమలో శుభ సంకల్పం, నరసింహ నాయుడు, సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్, హైపర్ వంటి కొన్ని సినిమాల్లో నటించిన కె విశ్వనాథ్ కెమెరా ముందు కూడా మెప్పించారు. ఆయన కోలీవుడ్‌లో కురుతిపునల్, మూగవారీ, బాగవతి, యారడి నీ మోహిని, ఉత్తమ విలన్ మొదలైన ప్రముఖ చిత్రాలలో కూడా నటించాడు.

సినిమా రంగానికి ఆయన చేసిన శ్రేష్ఠమైన కృషికి గాను,  1992లో పద్మశ్రీ మరియు 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భారతీయ చలనచిత్రరంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయనకు అందజేశారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే  విశ్వనాథ్ శ్రీమతి జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, కుమార్తె పద్మావతి దేవి, కుమారులు నాగేంద్రనాథ్,  రవీంద్రనాథ్ ఉన్నారు.