Actor Rajasekhar Car Crash: మూడు పల్టీలు కొట్టిన కారు, నటుడు రాజశేఖర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ, కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు స్వాధీనం

రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు....

Rajasekhar survives with minor injuries in car crash. | Photo: twitter

Hyderabad, November 13: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ (Dr. Rajasekhar)  ప్రయాణిస్తున్న  TS 07 FZ 1234 నెంబర్ గల కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)  వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కారు గంటకు 180 కి. మీల వేగంతో వెళ్తున్నట్లు తెలిసింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు ముందు టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు మూడు పల్టీలు కొట్టినట్లు స్థానికుల కథనం ప్రకారం తెలుస్తుంది. అయితే రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు మెర్సిడెజ్ హై-ఎండ్ ఎస్‌యూవీ కావడం ద్వారా వాహనంలోని ఎయిర్‌బ్యాగులు సరైన సమయంలో తెరుచుకోవడంతో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు.

గత రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఓఆర్ఆర్ మార్గంలో ఇంటికి తిరిగి వస్తుండగా పెద్ద గోల్కోండ సమీపంలో అప్పా జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. తానే స్వయంగా కారు నడుపుతున్నారు, కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి ఆయనకు సహాయం అందించారు. మరో కారులో ఇంటికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎదురుగా వచ్చిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి, ఆయనను ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా? అనేది నిర్ధారించాల్సి ఉంది. కారులో మద్యం బాటిళ్లతో పాటు ఒక గ్లాసు కూడా లభించింది. అందులో కొంత మద్యం మిగిలి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అతివేగం కారణంగా కారు డివైడర్ ను ఢీకొన్న తర్వాత కూడా దాదాపు 200 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి రోడ్డుకు అవతలి వైపు పడింది. అదృష్టవషాత్తూ అటు వైపు ఎలాంటి వాహనం రాకపోవడంతో మరో ప్రమాదం తప్పినట్లయింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ ను ఈ అన్ని అంశాలపై విచారించనున్నారు.

రాజశేఖర్ కారు ప్రమాదానికి గురవడం ఇది మొదటిసారి కాదు, 2017లో కూడా హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ పై వెళ్తున్న మరో కారును తన కారుతో ఢీకొట్టాడు. అప్పుడు రాజశేఖర్ మద్యం సేవించి తన కారును ఢీకొట్టాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రాజశేఖర్ మద్యం సేవించలేదని, డిప్రెషన్ లో నిద్ర మాత్రలు తీసుకున్నట్లు పోలీసు నిర్ధారణలో తేలింది.