Chiranjeevi to Build a Hospital: హ్యాట్సాఫ్ చిరంజీవి, సినీ కార్మికుల కోసం సొంత ఖర్చుతో ఆస్పత్రి నిర్మాణం, పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగాస్టార్, ఏడాదిలో పూర్తిచేస్తానని హామీ
చిత్రపురి కాలనీలోని (Chitrapuri) పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని (build a hospital) నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు.
Hyderabad, AUG 20: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని (Chitrapuri) పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని (build a hospital) నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. ఈ మేరకు క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) ఈ ప్రకటన చేశారు. ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు ఉందని, అయితే ఎంతో ఆపాయ్యంగా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చిందని, రూ.20లక్షలు విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు చిరంజీవి. దాతలు సహకరిస్తే సినీ కార్మికులకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిరంజీవి చెప్పారు.
చిత్రపురి కాలనీలో ఓ ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన కలిగింది. పెద్ద ఆసుపత్రులకు వెళ్లే అంత ప్రాబ్లమ్ లేని వారి కోసం చిత్రపురి కాలనీలో ఆసుపత్రి ఉంటే బాగుండు అనిపించింది. చిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులందరికీ, బీపీఎల్ లోపు ఉన్న వారికి, రోజు కూలీ చేసే కార్మికులకు.. వీళ్లందరికీ ఉపయోగపడేలా ఆసుపత్రి ఉంటుందని అనుకున్నా. చాలా కార్పొరేట్ ఆసుపత్రుల పెద్దలంతా నాకు స్నేహితులే. వాళ్లందరి సహకారంతో నేను కచ్చితంగా చేయగలను, ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంతా కాదని అనిపించింది. ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేశాను. ప్లాన్ అయిన తర్వాత మొట్టమొదటగా చేయూత అందించిన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా నాన్న కొణిదెల వెంకట్రావ్ పేరు మీద ఆసుపత్రి నిర్మిస్తున్నా. ఈ బర్త్ డే మీకు మాట ఇస్తున్నా. వచ్చే బర్త్ డే నాటికి ఆసుపత్రిలో సేవలు ప్రారంభించేలా చూస్తాను. ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. సంతోషంగా వారికి కూడా ఆ ఆనందం, అనుభూతి ఇస్తాను. లేదంటే మొత్తం ఖర్చు పెట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మన ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమైన మా వర్కర్లకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను” అని చిరంజీవి అన్నారు.
”సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నపుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఉద్యమంలా బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి కారణమిదే. ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా ఈరోజు మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే కారణం సినీ పరిశ్రమ. ప్రేక్షకులు మాకు ఆ అవకాశం కల్పించారు. అలాంటి వారికి ఎంతో కొంత మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిరంజీవి చేసే దానికి ప్రచారం అక్కర్లేదు. కానీ సమాచారం కావాలి కదా. సమాచారాన్ని చూసి పది మంది స్ఫూర్తి పొందుతారు. వారు ఇంకో పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి తెలిసేలా చేస్తున్నా” అని చిరంజీవి అన్నారు.