Political Movies in Telugu: తెలుగు తెరపై జిందాబాద్‌లు కొట్టించుకున్న రాజకీయ చలనచిత్రం. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్

కావాల్సినంత డ్రామా, మసాలా ఇక్కడ దొరుకుతుంది. అందుకే తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకూ...

Few thought provoked political backdrop movies in Telugu.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో రాజకీయ నాయకులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇంకొంత మంది రాజకీయ నాయకులకు సినీ స్టార్ల కంటే కూడా ఎక్కువ చరిష్మా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. కావాల్సినంత డ్రామా, మసాలా ఇక్కడ దొరుకుతుంది. అందుకే తెలుగులో రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకూ తెలుగులో NTR,  లక్ష్మీ's NTR, యాత్ర పొలిటికల్ బయోపిక్ లతో పాటు. రంగస్థలం, వంగవీటి, లెజెండ్, ప్రస్థానం, MLA లాంటి ఎన్నో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చాయి.

అయితే పూర్తిగా రాజకీయాలే కథాంశంగా తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. అవెంటో ఒకసారి తెలుసుకోండి.

భరత్ అనే నేను

సూపర్ స్టార్ మహేశ్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రలో చేసిన పొలిటికల్ మూవీ ఇది. ఒక సీఎం అంటే ఎలా ఉండాలి, ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఇచ్చిన మాటకు కట్టుబడి అది ఎంతకష్టమైన దానిని 100% అమలు చేయాలి అనే పాయింట్ తో ఈసినిమా కథ నడుస్తుంది.

సినిమాలోని టైటిల్ సాంగ్ లో వచ్చే ఓ లిరిక్ దాని ప్రాముఖ్యతను తెలుపుతుంది. "మాటిచ్చా నేనీ పుడమికి.. పాటిస్తా ప్రాణం చివరికి.. అట్టడుగున నలిగే కలలకి.. బలమివ్వని పదవులు దేనికి.."

నేనే రాజు నేనే మంత్రి

రానా దగ్గుబాటి నటించిన ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమా కథ మొత్తం రాజకీయ వ్యూహాలు, సీఎం కుర్చీ దక్కించుకునేందుకు వేసే ఎత్తులు వాటిపైనే ఫోకస్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సమకాలీన రాజకీయంలో జరిగిన కొన్ని సంఘటనలను పోలి ఉంటాయి.

"వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే నేను అవుతా సీఎం".

NOTA

విజయ్ దేవరకొండ సీఎం పాత్రలో నటించిన చిత్రం ఇది. సీఎంగా ఉండే తన తండ్రి అర్ధాంతరంగా సీఎం కుర్చీ దిగిపోవాల్సి రావడంతో ఆ స్థానాన్ని కొడుకు (విజయ్) భర్తీ చేస్తాడు. అప్పటివరకూ ప్రతిపక్షం 'డమ్మీ సీఎం' అని ఆరోపణలు చేస్తుంది, అక్కడ్నించి అతడు 'రౌడీ సీఎం' గా ఎలా పేరు తెచ్చుకుంటాడు. ప్రజాక్షేమం కోసం ఎలాంటి డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటాడు అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కథ ఎక్కువగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది.

లీడర్

ఇది రానా దగ్గుబాటి హీరోగా నటించిన తొలి సినిమా. రాజకీయంలో అవినీతిని ఎత్తిచూపుతూ సాగే చిత్రమిది. ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తేనే ప్రజాక్షేమం కోరే నిజమైన లీడర్లు వస్తారనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

"అవినీతిని అంతం చేసే దమ్ము నాకుంది, ప్రజల సొమ్మును ప్రజలకే పంచే దమ్ము నాకుంది. ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము మీకుందా?".

ప్రతినిధి

నారా రోహిత్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఒక కామన్ మ్యాన్ ఏకంగా సీఎంను కిడ్నాప్ చేస్తాడు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఆ కిడ్నాపర్ డిమాండ్స్ ఏంటి? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది కూడా రాజకీయ అవినీతిపై వచ్చిన చిత్రమే. ఇందులో కిడ్నాపర్ పెద్దనోట్లను రద్దు చేయాలని మళ్ళీ గాంధీబొమ్మ లేకుండా చెల్లుబాటు అయ్యే కొత్త నోట్లను అమలులోకి తీసుకురావాలి అని వింతైన కోర్కెలు కోరతాడు.

"ప్రజలకు గవర్నమెంట్ స్కూల్స్ పనికిరావు కానీ, గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలి".

అధినేత

జగపతి బాబు హీరోగా నటించిన చిత్రమిది. బాగా చదువుకొని ఏ పనిలేకుండా ఖాళీగా తిరిగే ఓ నిరుద్యోగికి నేరుగా ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుంది, అప్పట్నించీ వ్యవస్థలో అట్టడుగు స్థాయి నుంచి జరుగుతున్న దోపిడి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు ఒక సీఎం పరిష్కరిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు.

ఆపరేషన్ దుర్యధన

ఈ సినిమా టైటిల్ లోనే ఉంది కథ ఏంటి అనేది. అవినీతి, గూండాగిరి చేసే రాజకీయ నాయకులను ఏరివేయడం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. పోసాని కృష్ణమురళి మార్క్ డైలాగ్స్, కథలు ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించారు.