Music University In Telangana: దేశంలోనే తొలి మ్యూజిక్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు, ఇళయరాజా అంగీకరిస్తే ప్రారంభిస్తామన్న కేటీఆర్
మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.
Hyderabad, May 06: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇండ్లల్లో పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌తో పాటు సంగీతం సైతం ప్రాధాన్యంగా ఉండాలన్నారు. 17 సంవత్సరాల తన తనయుడు హిమాన్షు మూడు నెలల కింద తాను ఓ పాటపాడాడని, రిలీజ్ చేస్తున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోయానని కేటీఆర్ తెలిపారు. తన వాయిస్, ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని, ఎందుకంటే ఎలాంటి శిక్షణ లేకుండా ఆల్బమ్‌ను విడుదల చేశాడని కేటీఆర్ పేర్కొన్నారు.
చాలా మందిలో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని వెలికితీయాలన్నారు. ఇళయరాజాతో కలిసి వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందన్న కేటీఆర్.. ఆయన అంగీకరిస్తే రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీ (Music University) నెలకొల్పుతామన్నారు. దీనికి ఇళయరాజా స్పందిస్తూ తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని, మంత్రి వచ్చి ప్రజలను వరాలు కోరుకోవాలని అడగడం ఆనందంగా ఉందన్నారు.
మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదని, మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటైతే.. తనలాంటి ఇళయరాజాలు 200 మంది తయారవుతారన్నారు. దేశం నుంచి వెళ్లిన వారంతా ప్రపంచదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. మ్యూజిక్ యూనివర్సిటీకి సంగీత దర్శక దిగ్గజం అంగీకరించడంతో త్వరలోనే మ్యూజిక్ స్కూల్‌తో పాటు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత పాపారావు, చిత్రబృందానికి కేటీఆర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ శ్రియా శరణ్‌తో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు.