IPL Auction 2025 Live

Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Hyderabad January 09: సూపర్‌ స్టార్‌ కృష్ణ(Super star Krishna) ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించారు రమేశ్‌బాబు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju)’(1974) సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. ‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్‌’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) దర్శకత్వం వహించిన ‘నీడ’లో తొలిసారిగా టీనేజ్‌ ప్రధాన పాత్ర చేశారు. రమేశ్‌ సోదరుడు మహేశ్‌బాబు (Mahesh Babu)కు బాలనటుడిగా ఇదే తొలి చిత్రం. దాసరి ‘పాలు నీళ్లు’లోనూ రమేశ్‌ ప్రధాన పాత్రలో కనిపించారు.

వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన సామ్రాట్‌ (Samrat)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్‌ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. ‘బజారు రౌడీ’, ‘అన్నాచెల్లెలు’చిత్రాలు రమేశ్‌ కెరీర్‌లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 1997లో ఎన్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఎన్‌కౌంటర్‌’రమేశ్‌బాబుకి చివరి చిత్రం.

Mahesh Babu COVID: హీరో మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌

ఆ తర్వాత 1999లో వచ్చిన హిందీ చిత్రం ‘సూర్యవంశమ్‌’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేశారు. తర్వాత తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించి, సోదరుడు మహేశ్‌బాబు హీరోగా ‘అర్జున్‌(Arjun Movie)’(2004) చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఆ తర్వాత మహేశ్‌తోనే ‘అతిథి(Athidhi Movie)’సినిమాను నిర్మించారు. మహేశ్‌ ‘దూకుడు(Dookudu)’, ‘ఆగడు(Aagadu)’చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. రమేశ్‌ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  తండ్రి కృష్ణతో ‘కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్‌కౌంటర్‌’చిత్రాల్లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు రమేశ్‌. తమ్ముడు మహేశ్‌తో ‘బజారు రౌడీ, ‘ముగ్గురు కొడుకులు’చిత్రాల్లో నటించారు.

రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మెగా ఫ్యామిలీ హీరోలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే హీరో మహేష్ బాబుకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌ లో ఉన్నారు. దీంతో రమేష్ బాబు అంత్యక్రియలకు ఆయన వస్తారా? లేదా? అన్నది తెలియడం లేదు.