RGV Cinematic Attack: రామ్ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీ. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఆంధ్రా రాజకీయాలపై వివాదాస్పదమైన పాట విడుదల.
ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అంటూ ప్రస్తావించారు...
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై పగబట్టినట్లే అనిపిస్తుంది. టీడీపీకి రాజకీయ ప్రత్యర్థుల కంటే కూడా రాంగోపాల్ వర్మనే ప్రధాన ప్రత్యర్థి అనేటంతగా తన సినిమాలతో, వివాదాస్పద ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. గతంలో 'రక్తచరిత్ర', 'వంగవీటి' లాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలతో ఎన్నో వివాదాలకు కారణమైన వర్మ, మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబును విలన్ గా చూపుతూ 'లక్ష్మీ's NTR' సినిమాను తెరకెక్కించి రాజకీయ వేడిని మరింత పెంచాడు. ఆ సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు, హైకోర్టు కూడా ఆ సినిమా విడుదలకు అడ్డుకట్ట వేసింది. ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేసుకున్న వర్మ, ఇక ఎన్నికల్లో గెలిచి వైఎస్. జగన్ సీఎం కావడంతో వర్మ తన చర్యలకు మరింత పదును పెంచాడు.
లేటెస్ట్ గా అత్యంత వివాదాస్పదమైన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ దానికి రివర్స్ గా 'అత్యంత వివాద రహిత సినిమా' (the MOST NON CONTROVERSIAL film ever) అంటూ సరికొత్తగా పబ్లిసిటీ చేయడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు.ఈ పాటలో నేరుగా చంద్రబాబుపై టార్గెట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం, ఆ ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలు, ఏపీ అసెంబ్లీ సెషన్స్ లో అధికార-విపక్ష సభ్యుల మధ్య జరిగిన మాటల యుద్ధం వంటి సన్నివేశాలతో ఆ పాటను పూర్తిగా నింపేశారు. టీడీపీ అనుకూల మీడియాను, పాత్రికేయులను సైతం ఆర్జీవీ వదిలిపెట్టలేదు.
ఏపీలో ఇప్పుడు రక్తపాతం లేని అధికార యుద్ధం జరుగుతుందని, పవర్ లో ఎవరుంటే వారిదే రాజ్యం, ప్రత్యర్థులు భయంతో పార్టీలు మారుతూ శరణు వేడుకుంటున్నారు. ఏపీ రాజకీయ చిత్రంలో ఇప్పుడు ప్రజలు ప్రేక్షకులు అంటూ ప్రస్తావించారు.
ఒకవైపు వైసీపీ ముఖ్య నాయకులు విజయసాయి రెడ్డి 'సైరా పంచ్' పేరుతో టీడీపీపై ధాటిగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఆర్జీవీ సినిమాలు, సీఎం వైఎస్. జగన్ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు బ్యాచ్ వీటిపై ఎలా స్పందిస్తుందో. ముఖ్యంగా ఈ 'కమ్మ రాజ్యం కడప రెడ్లు' అంశం ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.