KRKR: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్చికం అంటూ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' లో నుంచి మరో పోస్టర్ స్టిల్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ తన సినిమా కంటే కూడా అందులోని నిజజీవిత పాత్రలకు జిరాక్స్ కాపీలా ఉండే పాత్రలను తీసుకురావడంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా అని చెప్పొచ్చు...

A still from RGV's upcoming flick KRKR | Photo- RGV

వివాదస్పదమైన పాత్రలతో వివాదరహిత చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu) రూపొందిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటూ, తన సినిమాలలో వినోదం లేకపోయినా సరే వివాదం ఖచ్చితంగా ఉండాలి అని బలంగా నమ్మే విభిన్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma), తన తాజా సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం కూడా వినూత్నంగా వివాదాస్పదంగా ఉండే పోస్టర్లని విడుదల చేస్తూ తనపై, తాను తీయబోయే సినిమాపై హైప్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు.

రెండు రోజుల క్రితమే ట్రైలర్ రిలీజ్ పోస్టర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ , తాజాగా మరో పోస్టర్ కూడా విడుదల చేశారు. దీపావళి ఆశీర్వాదాలతో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ అక్టోబర్ 27కి ఒకరోజు తర్వాత ఉదయం 9:36 నిమిషాలకు విడుదలవుతుంది. అని చెప్తూ, సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వదిలారు. దాంట్లో చుట్టూ ముగ్గురు, నలుగురు అమ్మాయిలతో ఓ రాజకీయ నాయకుడు ఉన్నట్లు అనిపించేలా మెడలో ఎర్ర కండువా, వెనక ఓ పార్టీ జెండాను పోలిన బ్యాక్ గ్రౌండ్ ను ఉంచాడు. ఆపై ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్చికం అని ట్వీట్ లో పేర్కొన్నారు. చంద్రబాబును అచ్చుగుద్ధినట్లు దింపేసిన రాంగోపాల్ వర్మ

RGV's Tweet-1

ఆర్జీవీ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల పైనే కేంద్రీకరించబడి ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అందులో కథ ఏముంటుందనేది ఆర్జీవీకే తెలియాలి.

RGV's Tweet-2

అక్టోబర్ 27కి ఒకరోజు తర్వాత ట్రైలర్ రిలీజ్ అని చెప్పారు, అంటే అక్టోబర్ 28 అని అనుకోవాలి, ఆ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా కథ ఎలా ఉండబోతుంది అని కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ తన సినిమా కంటే కూడా అందులోని నిజజీవిత పాత్రలకు జిరాక్స్ కాపీలా ఉండే పాత్రలను తీసుకురావడంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా అని చెప్పొచ్చు.