Sirivennela Seetharama Sastry Funeral: ఇక సెలవు..ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు, సీతారామశాస్త్రితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడిపెట్టిన టాలీవుడ్ ప్రముఖులు
జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను (Sirivennela Seetharama Sastry Funeral) పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు.
ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను (Sirivennela Seetharama Sastry Funeral) పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ నిప్పంటించారు. అభిమానుల సందర్శనార్థం ఈ ఉదయం సిరివెన్నెల భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలించాంబర్ కి తరలించారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ ఆవేదనను ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేదని తారక్ ఎమోషనల్ అయ్యారు. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన..ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బ్రతికున్నంతకాలం చిరస్మరణీయంగా ఆ సాహిత్యం మిగిలిపోతుంది అని చెప్పుకొచ్చారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు.
సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు.సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటామని సింగర్ కౌసల్య అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు.
సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.
జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదేనని పరుచూరి తెలిపారు.
సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్‌ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు.
ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు.
ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.