Sirivennela Seetharama Sastry (Photo-Twitter/Vice President of India)

ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరేళ్ల క్రితం సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తియాల్సి వచ్చింది. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకడంతో ఆపరేషన్‌ చేసి సగం తొలగించాం. ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారు. ఐదు రోజుల నుంచి ఎక్మా మిషన్ మీద ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌, పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్‌ శరీరమంతా సోకి చివరకు మంగళవారం సాయంత్రం 4: 07 గంటలకు తుది శ్వాస విడిచారు’అని వెల్లడించారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సిరివెన్నెల మృతిపై (Sirivennela Seetharama Sastry Dies) సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీతారామ శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్‌ (Director K Viswanath). వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్‌. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్‌. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో విచారించానన్నారు. సినిమా ‘సిరివెన్నెల’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ.. ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను ఒకడినన్నారు.

Here's Vice President of India Tweet

సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానన్నారు. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మరణవార్త వినాల్సిరావడం విచారకరమన్నారు. సిరివెన్నల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Here's Chiranjeevi Konidela Tweet

మెగస్టార్‌ చిరంజీవి కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ముృతికి సంతాపం తెలిపారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజన్నారు చిరంజీవి. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు.