Tatineni Ramarao Dies: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
తెలుగు, హిందీ సినిమాల సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (Tatineni Ramarao Dies) (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, హిందీ సినిమాల సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (Tatineni Ramarao Dies) (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా నవరాత్రి. దర్శకునిగా పనిచేయడానికి ముందు ఆయన (Veteran director Tatineni Rama Rao) తన కజిన్ తాతినేని ప్రకాశ్‌రావు వద్ద, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగ దేవత, న్యాయానికి సంకెళ్లు చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. యమగోల బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తాతినేనిని యమగోల రామారావుగా ఆయన పేరు నిలిచిపోయింది. ఈ సినిమాను హిందీలో లోక్ పరలోక్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సక్సెస్ కొట్టారు. కార్తీక దీపం' మూవీని 'మాంగ్ భారో సజన'గా, 'న్యాయం కావాలి'ని 'ముజే ఇన్‌సాఫ్ చాహియే'గా, 'ముగ్గురు మిత్రుల'ను 'దోస్తీ దుష్మనీ'గా, 'మయూరి'ని 'నాచె మయూరి'గా తెరకెక్కించారు.
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్నుమూత
ఇవేగాక జీవన్‌ధార, జుదాయి, అంధకానూన్, ఏ దేశ్, దోస్తీ, దుష్మనీ, రావణ్‌రాజ్, బులాండీ వంటి పలు హిందీ చిత్రాలను డైరెక్ట్ చేశారు. హిందీలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన ఆయన తెలుగువారి హిందీ దర్శకుడు అనే పేరు సంపాదించారు. తెలుగులో గోల్‌మాల్ గోవిందం, హిందీలో భేటీ నంబర్ 1 ఆయన చివరి చిత్రాలు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.