Hamza Saleem Dar: కేవలం 43 బంతుల్లో 193 రన్స్ చేసిన బ్యాట్స్ మెన్, యూరోపియన్ క్రికెట్ టీ-10 లీగ్ లో సంచలనం, సిక్సర్ల ద్వారానే ఏకంగా 132 పరుగులు చేసిన హమ్జా
నిర్ణీత 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హమ్జాతో పాటు మరో ఓపెనర్ యాసిర్ అలీ 19 బంతుల్లోనే 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ10 క్రికెట్ చరిత్రలో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు టీ10లలో అత్యధిక స్కోరు 163గా ఉంది.
New Delhi, DEC 08: బ్యాట్ ఆధిపత్యం ఎక్కువగా ఉండే పొట్టి క్రికెట్‌లో (Cricket) బ్యాటర్ల బాదుడుకు బంతి చిన్నబోవాల్సిందే. టీ20లలోనే బాదుడుకు రికార్డులు కనుమరుగవుతున్న క్రమంలో పుట్టుకొచ్చిన టీ10 (T-10) ఫార్మాట్‌లో కూడా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 60 బంతులు మాత్రమే ఉండే ఈ లీగ్‌లో బ్యాటర్ల బాదుడు మామూలుగా ఉండదు. తాజాగా ఓ క్రికెటర్.. 43 బంతుల్లోనే ఏకంగా డబుల్ సెంచరీ (193 నాటౌట్) చేసినంత పనిచేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 14 బౌండరీలున్నాయి. అంటే 43 బంతుల్లో 36 సార్లు అతడు ఆడిన బంతి బౌండరీ లైన్ దాటింది. ఈ వీరబాదుడు బాదిన బ్యాటర్ పేరు హమ్జా సలీమ్ దార్. యూరోపియన్ క్రికెట్ టీ10 లీగ్‌లో భాగంగా హమ్జా (Hamza Saleem Dar) ఈ రికార్డు నమోదుచేశాడు. యూరోపియన్ క్రికెట్ టీ10 మ్యాచ్‌లో భాగంగా కాటలున్యా జాగ్వార్ వర్సెస్ సోహల్ హాస్పిటాల్టెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హమ్జా ఈ రికార్డు నెలకొల్పాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వార్.. నిర్ణీత 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హమ్జాతో పాటు మరో ఓపెనర్ యాసిర్ అలీ 19 బంతుల్లోనే 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ10 క్రికెట్ చరిత్రలో ఇదే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు టీ10లలో అత్యధిక స్కోరు 163గా ఉంది.
హమ్జా చేసిన 193 పరుగులలో సిక్సర్ల ద్వారా 132 పరుగులు రాగా ఫోర్ల ద్వారా 56 (మొత్తంగా 188) పరుగులు వచ్చాయి. అంటే అతడు సింగిల్స్, డబుల్స్ ద్వారా చేసినవి 9 పరుగులు మాత్రమే. అనంతరం ఛేదనలో హాస్పిటాల్టెట్ 10 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో జాగ్వార్.. 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.