Terrorist Attack in JK: జమ్ముకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆర్మీ వాహనంపై దాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. దాడిలో మరో ఇద్దరు పౌరులు కూడా బలి
బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు.
Newdelhi, Oct 25: హిమాలయ ప్రాంతం జమ్ముకశ్మీర్ (JammuKashmir) లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు. ఎల్ వోసీకి సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని నాగిన్ పోస్ట్ కి సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అలాగే ఇదే దాడిలో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. దాడి నేపథ్యంలో సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు మళ్లీ మొదలయ్యాయని ఆర్మీవర్గాలు అంచనా వేశాయి. దీంతో ఈ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి బలగాలు నిఘాను పెంచాయి. ఆర్మీ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు రోజుల్లో రెండో ఘటన
గత ఐదు రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్ లో జరిగిన రెండవ ఉగ్రవాద దాడి ఇది. గత ఆదివారం గందర్ బల్ జిల్లాలో నిర్మాణ స్థలంలో కార్మికుల క్యాంప్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు, ఒక డాక్టర్ చనిపోయిన విషయం తెలిసిందే. కాగా తాజా ఉగ్రవాదుల దుశ్చర్యపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ దాడిని ఖండించారు.