Abhinandan 51 Squadran: అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు, ఆయనతో పాటు టీం మొత్తానికి యూనిట్ సైటెషన్ అవార్డు, 87 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న వాయుసేన, వేడుకకు ఘనంగా ఏర్పాట్లు
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత పాకిస్థాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే.
New Delhi, October 6: బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత పాకిస్థాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది కూడా. పాక్ వాయుసేన ఇండియాపైకి వచ్చినప్పుడు, ఓ ఎఫ్-16 విమానాన్ని కూల్చి, ఆపై ప్రమాదవశాత్తూ పాక్ సైనికులకు చిక్కి, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్, ఇప్పుడు తన టీమ్ మొత్తానికీ అరుదైన గుర్తింపును అందించాడు. వారి టీం 51వ స్క్వాడ్రన్‌కు యూనిట్ సైటెషన్ అవార్డు దక్కింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 8న జరిగే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా అవార్డును అందించనున్నారు.స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్‌కు చెందిన 601 సిగ్నల్ యూనిట్‌కూడా యూనిట్ సైటేషన్ అందుకోనుంది. 87వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైన వాయుసేన, ఈ ఉదయం నుంచి ఘజియాబాద్ లోని ఎయిర్ బేస్ లో ఫుల్ డ్రస్ రిహార్సల్స్ చేస్తోంది. పలు అధునాతన విమానాల ప్రదర్శన, అబ్బురపరిచేలా ఎయిర్ షో, ఆకాశ్ గంగా టీమ్లోని స్కై డైవర్స్ స్టంట్లు తదితరాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
కాగా ఫిబ్రవరి 26న భారత వాయిసేన పాక్‌లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై దాడులు జరపగా, ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో అభినందన్ మిగ్-21 బైసన్ ఫైటర్‌లో పీఓకేలోకి అడుగుపెట్టారు. మిగ్-21తో పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16ను కూల్చివేశారు. ఆ తర్వాత మిగ్ కూలిపోవడంతో అభినందన్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. ఆయనను స్థానికులు పట్టుకుని పాక్ సైనికులకు అప్పగించారు. చెక్కుచెదరని నిబ్బరంతో వ్యవహరించిన అభినందన్‌ను ఆ తర్వాత దౌత్య ఒత్తిడితో పాక్ విడిచిపెట్టింది. శత్రుచెరలో ఉన్నప్పుడు కనబరిచిని ధైర్యసాహసాలకు గాను వర్ధమాన్‌కు భారత ప్రభుత్వం 'వీర్ చక్ర' ప్రకటించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును వర్ధమాన్ అందుకున్నారు.