Amaravati Land Scam: అమరావతి భూముల స్కాం, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా
తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Amaravati, Nov 25: అమరావతి భూముల స్కాం కేసులో (Amaravati Land Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదును నిలిపివేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ అమరావతి భూ కుంభకోణం కేసుకు (Amaravati land scam case) సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై (Andhra Pradesh High Court orders) సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి భూ కుంభకోణం కేసులో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ( Supreme Court) బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయవద్దా. విచారణ వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు అంటారు.
ఈ కేసులో అసలు ఏమీ జరగకూడదా. మాజీ అడ్వకేట్ జనరల్ కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఈ ఆర్డర్స్ ఎలా వర్తింపజేస్తారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు’’ అంటూ దిగువ న్యాయస్థానం వ్యవహరించిన తీరును రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై స్టే విధిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం విదితమే. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు.