Indian Army Advisory: వాట్సప్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి, సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ, వాట్సప్ లో ఎటువంటి సమాచారం పంపొద్దని హెచ్చరిక
ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది.
New Delhi, November 24: ఇండియాకు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ గూఢాచారి సంస్థ (Pakistani Intelligence Operatives) ఐఎస్ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ( Indian Army) తమ సిబ్బందికి కీలక సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు.
రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సప్ గ్రూప్‌లలో షేర్ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సప్‌లో సమాచారం షేర్ చేయొద్దని చెప్పారు.
అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే పాకిస్తాన్ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు వాట్సప్‌లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలని ఆర్మీ అధికారులు సైనికులకు సూచించారు.
Indian Army Advisory
తద్వారా అనుమానిత గ్రూప్‌లలో ఆటోమేటిక్‌గా మెంబర్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. అయితే, ప్రమాదంలో ఉన్న సైనికుల్ని అప్రమత్తం చేయడానికి వాట్సప్ గ్రూపులు(WhatsApp groups) పనిచేస్తాయని కొందరు అంటున్నారు.
ఈ మధ్య ఇండియాకు చెందిన ఆర్మీ జవానును పాక్ కు చెందిన అనుమానిత ఫోన్ నంబర్ +923032569307 ద్వారా వాట్సప్ గ్రూపులో చేర్చినట్లు ఆర్మీ పేర్కొంది. వెంటనే జవాను అప్రమత్తమై ఆ గ్రూపు నుంచి వైదొలిగి ఆ గ్రూపుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ అలర్ట్ అయింది. ఇటీవల పాక్ గూఢాచారులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇద్దరు ఆర్మీ జవాన్లపై వలపు వల విసిరిన ఉదంతం వెలుగు చూసిన నేపథ్యంలో ఆర్మీ ఈ సూచనలు చేసింది.