Calcutta High Court: 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోతే మీకే నష్టం.. యుక్త వయస్కులు లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి: కలకత్తా కోర్టు
లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని పేర్కొన్నది.
Newdelhi, Oct 21: పోక్సో కేసులో (POCSO Case) కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక కోరికలను (Sex Desires) నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని పేర్కొన్నది. ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని, చెడ్డపేరు తెస్తుందని పేర్కొన్నది. పరస్పర అంగీకారంతో సెక్స్ లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొన్న ఓ వ్యక్తికి సెషన్స్ కోర్టు 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
18 ఏండ్లలోపు పెండ్లి
తన ఇష్టపూర్వకంగానే సంబంధం పెట్టుకున్నానని సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అనంతరం అతడిని పెండ్లి చేసుకొన్నట్టు చెప్పింది. 18 ఏండ్లలోపు పెండ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె కోర్టు ఎదుట ఒప్పుకొన్నది. దీంతో ఈ కేసులో నిందితుడిని కలకత్తా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా యువతీయువకులకు ధర్మాసనం పలు సూచనలు జారీ చేసింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అన్నింటికంటే ముఖ్యమని సూచించింది. అలాగే, అమ్మాయిలను అబ్బాయిలు గౌరవించాలని పేర్కొన్నది. వారి హక్కులు, గోప్యతను కాపాడాలని సూచించింది. ఈ విషయంలో తల్లిదండ్రులే మొదటి గురువుగా ఉండాలని, పిల్లలకు మంచిచెడులు చెప్పాలని తెలిపింది.