Cyclone Alert: నెల్లూరుకు 530 కి.మీ దూరంలో వాయుగుండం, ఏపీలో దంచికొడుతున్న వర్షాలు, తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy rain alert for Andhra Pradesh and Telangana(X)

Vjy, Oct 15: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉండడంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి మంగళవారం అర్ధరాత్రి వాయుగుండంగా బలపడింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి (Chennai) 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది. వాయుగుండం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు కావలి, అల్లూరు, బిట్రగుంట, గుడ్లూరు, లింగసముద్రం, వింజమూరు, వరికుంటపాడు, ఇందుకూరుపేట, కొండాపురం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులోకి వరద ఎక్కువగా చేరుతోంది. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, రాజుపాలెం, కొత్తపట్నం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. తీరప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు 360 మంది పోలీసులతో 18 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. కడప బస్టాండ్‌లోకి భారీగా వరదనీరు చేరింది. పోరుమామిళ్ల, ఒంటిమిట్టలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Cyclone Live tracker 

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి పాదాలు, జాపాలి, ఆకాశగంగకు భక్తులను అనుమతించడం లేదు. వర్షాల కారణంగా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.

వాయుగుండం తీరం దాటే సమయంలో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. అలాగే వర్షాల నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.

బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. అలాగే బాపట్ల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో అంటే గురువారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.