Cyclone Kyarr Alert: హడలెత్తిస్తున్న క్యార్ సైక్లోన్, సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం, 17 మంది జాలర్లను రక్షించిన ఇండియన్ నేవీ, కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఈ తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సైక్లోన్ ధాటికి కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు.
Mumbai, October 27: క్యార్ తుపాన్ గత రెండు రోజుల నుంచి నార్త్ ఇండియాను హడలెత్తిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సైక్లోన్ ధాటికి కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరికి 190 కిలోమీటర్ల దూరాన అరేబియా సముద్రంలో ఏర్పడిన క్యార్ తుపాన్..భీకరరూపం దాల్చుతున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఇది ఒమన్ తీరంవైపు పయనించనుందని వెల్లడించారు.
ఈ కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం
మహారాష్ట్రలోని రత్నగిరికి 190 కి.మీ., ముంబైకి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీ దూరంలో క్యార్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొంది. వచ్చే ఐదు రోజుల్లో ఇది ఒమన్‌వైపు కదిలే అవకాశం ఉన్నదని తెలిపింది. క్యార్ తుఫాన్ కారణంగా శనివారం గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తెల్లవారుజామున తుఫాన్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో తీరప్రాంతంలోని రత్నగిరి, సింధుదుర్గ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
క్యార్ తుఫాను ప్రభావం
ఇదిలా ఉంటే తిత్లీ తుఫాన్ ధాటికి నష్టం నుంచి కోలుకోలేదు. సహాయక చర్యలు పూర్తికానే లేదు. బీభత్సం సృష్టించేందుకు క్యార్ తుఫాన్ సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ఓ ఐదు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో గంటకు 60 నుంచి 70కిలీమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 28 నుంచి 31 వరకు ప్రజలు క్యార్ తుఫాను నుంచి అప్రమత్తతతో ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఇండియన్ నేవీ సాహసం
అరేబియా సముద్రంలో చిక్కుకున్న 17 మంది జాలర్లను ఇండియన్ నేవీ రక్షించింది. క్యార్ తుఫాన్ ధాటికి వీరంతా సముద్రంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న నేవీ దళాలు వెంటనే రంగంలోకి దిగి వారిని కాపాడాయి.