JEE Main 2022 Exam Dates: జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, రెండు విడతల్లోనే పరీక్షలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule released) విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule released) విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్, మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాషర్ వెల్లడించారు.
విద్యార్థులకు మార్చి ఒకటో తేదీ నుంచి 31 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్‌లైన్ విధానంలో రెండు విడుదలుగా నిర్వహించగా.. గతేడాది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు విడుదల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొన్న క్రమంలో యథావిధిగా రెండు విడుతల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో, రెండో దశ పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.
పరీక్షలకు వయో పరిమితి లేదు. కానీ, 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది. రెండేళ్లుగా కరోనా వల్ల జేఈఈ షెడ్యూల్ గందరగోళంగా తయారైంది. విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం కూడా కష్టమైంది. అయితే, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులంతా నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకుని, పరీక్షలకు పూర్తి స్థాయిలో ప్రిపేరయ్యే అవకాశాలున్నాయి. అయితే, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బోర్డ్ ఎగ్జామ్స్‌తో, జేఈఈ పరీక్షలు క్లాష్ అవుతాయేమోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
మరో వైపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష గురువారమే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించట్లు పేర్కొంది. జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఉంటుందని, జూలై 18న ఫలితాలను ప్రకటిస్తామని, మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలవుతుందని వివరించింది.