NEET UG 2022 Exam Results Declared: నీట్ యూజీ పరీక్షా ఫలితాలు విడుదల, రాజస్థాన్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్, ఫలితాలను neet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోండి
దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు.
నీట్(యూజీ) 2022 మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను (NEET UG 2022 Exam Results Declared) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు.తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు.
రాష్ట్రానికి చెందిన చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె.జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్వినిశ్రీ 52వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది నీట్–యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.17 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 1.13 లక్షల మంది, రాజస్తాన్ నుంచి 82,548 మంది అర్హత పొందారు.
బాలికల కేటగిరీలో చూస్తే.. చప్పిడి లక్ష్మీచరిత జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో నిలిచారు. ఇక ఎస్టీ కేటగిరీలో జాతీయ టాపర్‌గా తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్, రెండో ర్యాంకును గుగులోతు శివాని సాధించారు. లవోడ్య బృంద ఐదో, బూక్యా అనుమేహ ఆరో ర్యాంకులు సాధించారు.ఓబీసీ కేటగిరీలో చూస్తే.. యశస్వినీశ్రీ ఎనిమిదో ర్యాంకు పొందారు. తెలంగాణ నుంచి నీట్ కోసం 61,207 మంది రిజి్రస్టేషన్ చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. ఇందులో 35,148 మంది నీట్‌కు అర్హత సాధించారు. గతేడాది అర్హుల సంఖ్య 28,093 మందే కావడం గమనార్హం.