Madhya Pradesh: కునో నేషనల్ పార్కులో ఐదు చీతాలకు జన్మనిచ్చిన గామిని, మొత్తం 26కు చేరిన చీతాల సంఖ్య (ఫోటోలు, వీడియో ఇదుగోండి)
చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధిని పెంపొందించేందుకు కృషిచేసిన అటవీ శాఖ అధికారులు, వైద్యులు, ఫీల్డ్ సిబ్బందిని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. ఈ కూనలతో పాటు కునో జాతీయ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 26కి చేరిందన్న మంత్రి.. వీటి సంఖ్య మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
opal, March 10: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో ‘గామిని’ అనే దక్షిణాఫ్రికా చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని త్స్వాలు కలహరి రిజర్వ్ నుంచి తీసుకొచ్చిన ఈ ఆడ చీతా (ఐదేళ్లు) ఐదు కూనలకు జన్మనిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో కునో పార్కులో జన్మించిన చీతా కూనల సంఖ్య 13కి చేరిందన్నారు. గామిని భారత గడ్డపై ప్రసవించిన నాలుగో చీతా కాగా.. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో మొదటిదన్నారు. చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధిని పెంపొందించేందుకు కృషిచేసిన అటవీ శాఖ అధికారులు, వైద్యులు, ఫీల్డ్ సిబ్బందిని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. ఈ కూనలతో పాటు కునో జాతీయ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 26కి చేరిందన్న మంత్రి.. వీటి సంఖ్య మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project cheetah)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా 2022లో నమీబియా నుంచి భారత్‌కు ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు. వీటిలో ఐదు ఆడ, రెండు మగ చీతాలు ఉన్నాయి. వాటిని ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. రెండో విడతలో 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. అయితే, గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు జ్వాలకు జన్మించిన మూడు కూనలతో పాటు మొత్తం 10 చీతాలు వివిధ కారణాల వల్ల మృతిచెందగా.. ప్రస్తుతం కునో జాతీయ పార్కులో 26 చీతాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఏడు ఆడ, ఆరు మగ చీతాలతో పాటు 13 కూనలు ఉన్నాయి.