Economic Package-2: లాక్‌డౌన్ పొడగింపుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై పిడుగు పాటు, తీవ్రంగా నష్టపోయిన రంగాలకు మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే యోచనలో కేంద్ర ప్రభుత్వం
ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు గోల్డ్మన్ సాచ్స్ భారతదేశ జీడిపీ వృద్ధి 2020లో 1.5 శాతం నుండి 2 శాతం మాత్రమే నమోదు చేస్తుందని అంచనా వేశాయి....
New Delhi, April 17: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (COVID-19 in India) తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ఎన్నో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక మాంద్యంతో (economic crisis) చాలా రంగాలలో ఉద్యోగాల కోత కూడా ఎక్కువైంది. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం యొక్క లాక్డౌన్ పొడగింపు కారణంగా దేశంలోని 25 శాతం MSMEలు పూర్తిగా మూతపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన కొన్ని రంగాలను ఆదుకునేందుకు కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ( Economic Package 2) కోసం ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) నిన్న గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యారు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులను ఆమె ప్రధానికి వివరించారు. దేశంలో 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 437 కు పెరిగిన మరణాల సంఖ్య
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. విమానయాన రంగం, హాస్పిటాలిటీ, సరుకు ఎగుమతులు తదితర రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత జరుగుతున్న విషయం ప్రధాని మరియు ఆర్థికమంత్రి మధ్య చర్చకు వచ్చిందని తెలిసింది. ఆయా రంగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా ఆర్థిక మాంద్యం భయాల నుంచి కొంత ఊరట కలిగించే అంశంపై ఇరువురు చర్చించినట్లు నివేదికలు తెలిపాయి.
దేశంలో వ్యాపారాలపై COVID-19 వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం గత మార్చి నెలలోనే ఆర్థిక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏయే రంగాలపై ఎంత మేరకు నష్టం జరిగిందనే దానిపై కేంద్రం విశ్లేషించి దాని ప్రకారం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలను ఆదుకునేందుకు రూ. 1.7 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా దేశంలోని నిరుపేదలకు నగదు పంపిణీ, ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాలు తదితరమైనవి అందించగలిగారు.
మరోవైపు దేశంలో కోవిడ్-19 వ్యాప్తి, ఆర్థిక ప్యాకేజీల ప్రకటనల కారణంగా ఇప్పటికే దిగజారిన భారత జీడిపీ మరింత పతనమయ్యే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ ఏజేన్సీలు అంచనావేశాయి. ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు గోల్డ్మన్ సాచ్స్ భారతదేశ జీడిపీ వృద్ధి 2020లో 1.5 శాతం నుండి 2 శాతం మాత్రమే నమోదు చేస్తుందని అంచనా వేశాయి.