1301 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష, ఈ ఏడాది 1,301 మంది యాత్రికులు మృతి, అధికారికంగా ప్రకటించిన సౌదీ ప్రభుత్వం

సౌదీ అరేబియాలో వేడి దెబ్బకు యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Muslim Pilgrims Circumambulate The Kaaba, The Cubic Building At The Grand Mosque, During The Annual Hajj Pilgrimage In Mecca, Saudi Arabia (Photo: PTI)

Mecca,June 24: ముస్లింల పవిత్ర హజ్‌ యాత్ర (Hajj Yatra)లో ఈ ఏడాది కూడా భక్తులు అధిక సంఖ్యలో మృతి చెందారు. సౌదీ అరేబియాలో వేడి దెబ్బకు యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్‌ చేయడానికి వచ్చారని తెలిపింది. కాగా, అస్వస్థతకు గురైన 95 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది హజ్‌ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

ఈ ఏడాది హజ్‌ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈజిప్టు నుంచి మరో 10 లక్షలకు పైగా ముస్లింలు తరలివచ్చారని ప్రభుత్వం తెలిపింది. అయితే సౌదీలో అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఉక్కపోతతో ఊపిరాడక వారంతా చనిపోయినట్టు వెల్లడించింది. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు చెప్పారు. పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్‌ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే భారత్ నుంచి వెళ్ళిన 98 మంది మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది. కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్‌కు తరలించినట్లు సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ అల్‌-జలజెల్‌ వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారని ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్‌ యాత్రకు వెళ్లినవారేనని తెలిపాయి. వీరిని తీసుకెళ్లిన 16 ట్రావెల్‌ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఈజిప్టు నుంచి ఈ ఏడాది మొత్తం 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్‌కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

చట్టవిరుద్ధంగా హజ్‌ యాత్రకు (Hajj pilgrimage) వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు వెనక్కి పంపారు. కొంత మంది ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. వారు ఉండడానికి హోటళ్లు, గూడారులు సహా ఎలాంటి వసతులు లేవు. దీంతో ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు వారికి మార్గమే లేకుండా పోయింది. దీనివల్లే మరణాలు ఎక్కువైనట్లు అధికారులు తెలిపారు.

హజ్‌ యాత్రలో (Hajj pilgrimage) మరణాలు కొత్తేమీ కాదు. ఐదు రోజుల యాత్ర కోసం ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీ వెళ్తుంటారు. గతంలో అంటువ్యాధులు ప్రబలిన సందర్భాలూ ఉన్నాయి. తొక్కిసలాటలూ చోటుచేసుకున్నాయి. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు మక్కాలో క్రేన్‌ కూలిన ఘటనలో 111 మంది మరణించారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు కోల్పోయారు.



సంబంధిత వార్తలు