Red Alert In Bihar: జలదిగ్బంధనంలో బిహార్, భారీ వర్షాలతో అతలాకుతలం, 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతో పాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. భారీ వర్షాల వల్ల బీహార్ అతలాకుతలం అయింది. రాజధాని పాట్నా పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది.
Bihar,Septemebr 29: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతో పాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. భారీ వర్షాల వల్ల బీహార్ అతలాకుతలం అయింది. రాజధాని పాట్నా పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. బిహార్ రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వరదలతో బిహార్ రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల ధాటికి జనజీవనం స్తంభించగా 15 జిల్లాల్లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 20 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.
మధుబని, సపౌల్, అరరియ, కిషన్‌గంజ్, ముజఫర్‌పూర్, బంకా, సమస్తిపూర్, మధేపుర, సహస, పుర్నియ, దర్భంగ, భాగల్పూర్, ఖగారియా, కతిహార్, వైశాలి జిల్లాల్లో అధికారులు రెడ్‌అలర్ట్ ప్రకటించారు. మరోవైపు తర్పూ చంపరన్, శివ్‌హర్, బెగుసరై, సీతామర్హి, సరన్, సివన్ ప్రాంతాల్లోనూ వరద తాకిడి అధికంగా ఉంది. కాగా రాగల 24 గంటల్లో బిహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సీఎం నితీష్ కుమార్ అత్యవసర సమావేశం
వరద పరిస్థితిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో మాట్లాడారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీగా వర్షాలు పడడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. మెయిన్ రోడ్డుపై ఉన్న పలు దుకాణాలు నీటిలో మునిగాయి. వర్షం వెలిసినా… నీళ్లు మాత్రం రోడ్డుపై అలాగే ఉండిపోయాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి.
సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు
గత 24 గంటల్లో రాష్ట్రంలో 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుపౌల్, దర్బంగ వాతావరణ కేంద్రాలు 81.6, 61.2 మిల్లీమిటర్ల వర్షపాతాన్ని నమోదు చేశాయి. భాగల్పూర్ లో 134.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అస్తవ్యస్తమైన జన జీవనం
సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, జనతాదళ్ నాయకుడు అజయ్ అలోక్ పలువురి మంత్రుల నివాసాలు కూడా నీటిలో దిగ్భందమయ్యాయి. తన జీవితంలో ఇలాంటి వర్షాలను చూడలేదని తనింటి గ్రౌండ్ ఫ్లోర్ నీటిలో మునిగిపోయిందని అజయ్ అలోక్ వెల్లడించారు. నలంద మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లోకి వరద నీరు ప్రవేశించింది. రోగులు ఉండే వార్డులు మొత్తం నీటితో నిండిపోయాయి.
వరద నీటితో నిండిననలంద మెడికల్ కాలేజీ, హాస్పిటల్
ఐసీయూలోకి కూడా నీరు ప్రవేశించడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడ్డారు. నీటి మట్టం పెరుగుతుండడంతో రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ అధికారి కుమార్ రవి తెలిపారు.
రాజేంద్రనగర్, కంకర్‌బాగ్, కదంకౌన్, పాటలీపుత్ర కాలనీల్లో వర్షపు నీరు ఇండ్లల్లోకి ప్రవేశించింది. వర్షాల వల్ల టెలిఫోన్ లైన్లు, మొబైల్ సర్వీసులు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు జిల్లాల్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో రైలు సర్వీసులను కూడా పాక్షికంగా నిలిపేశారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సీఎంవో ఆదేశించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. పాట్నాలోనూ గంగా ప్రవాహాం ప్రమాదకరంగా ఉన్నది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)