MAHA and KYARR Alert: ఒకేసారి రెండు తుఫానులు, క్యార్ గాయం మానక ముందే దూసుకొస్తున్న మహా తుఫాన్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు, అల్లకల్లోలంగా మారిన అరేబియా సముద్రం

క్యార్ భీకర రూపం దాల్చిన సమయంలో ‘మహా’ అనే రెండవ తుఫాను కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తోందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది.

Heavy rains in Maharashtra, Goa, Karnataka in next 24 hours as Cyclone Maha And Kyarr to intensify (Photo Credits: PTI)

New Delhi, Novemebr 2: దాదాపు 120 యేళ్ల చరిత్రలో అరేబియా సముద్రంలో మొదటిసారిగా రెండు తుపానులు ఒకే సమయంలో కేంద్రీకృతమై ఉన్నాయి. క్యార్ భీకర రూపం దాల్చిన సమయంలో ‘మహా’ అనే రెండవ తుఫాను కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తోందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అరేబియా సముద్రంలో రెండు తుఫానులు కేంద్రీకృతమయ్యాయి. గత నెల 25న మహారాష్ట్రలోని రత్నగిరికి 350 కి.మీ దూరంలో పశ్చిమ దిశగా ఏర్పడిన మొదటి తుఫానుకు ‘క్యార్‌’ అని నామకరణం చేశారు. ఇది అతి తీవ్ర తుఫానుగా అరేబియా సముద్రంలో పశ్చిమ దిశగా పయనించి గురువారం రాత్రి ఓమన్‌ సమీపంలో బలహీనపడి సాధారణ తుఫానుగా మారింది.

ఈ విషయంపై వాతావరణ శాఖ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 120 ఏళ్లలో మొట్టమొదటిసారిగా అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు తుఫానులు ఏర్పడటం అరుదైన సంఘటనగా చెప్పింది.  ఈ విషయం వాతావరణ శాఖ మెరైన్‌ శాస్త్రవేత్తలను కొత్త పరిశోధనలకు ప్రోత్సహించినట్లుగా ఉందని, రెండు తుఫానులు ఒకే సమయంలో ఏర్పడడంపై పరిశోధనలు ప్రారంభించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ప్రపంచంలోనే ఒక్క బంగాళాఖాతంలో మాత్రమే ఒకే సమయంలో రెండు తుఫానులు ఏర్పడ్డాయి. అయితే, అరేబియా సముద్రంలో ఇటువంటి అరుదైన సంఘటన శాస్త్రవేత్తలను ఆలోచింపజేస్తుంది.

బలహీనపడిన ‘క్యార్‌’ తుఫాను

మరోవైపు బలహీనపడిన ‘క్యార్‌’ తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని, 2007లో అరేబియా సముద్రంలో ‘కేన్‌’ సూపర్‌ తుఫానుగా బలపడిందని, ఆ తరువాత 12 ఏళ్ల అనంతరం మళ్లీ సూపర్‌ తుఫాను ఏర్పడిందని వాతావరణ శాఖ నిపుణలు వెల్లడించారు. మహా తుఫాను తీవ్రరూపం దాల్చి లక్షదీవు లకు 25 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉత్తర దిశగా పయనిస్తోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల అరేబియా సముద్రంలో అలలు ఎగసిపడుతాయని, గంటకు 60 నుంచి 110 కి.మీ వేగం గా గాలి వీస్తుందని, అందువల్ల మాల్దీవులు, కేరళ సముద్ర ప్రాంతం, లక్ష దీవుల వైపు శుక్ర, శనివారాలలో జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు.

ఉత్తర - వాయువ్య దిశగా మహా తుఫాన్

ఈ నెల 4న బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ దిశగా కదులుతుందని, జాలర్లు ఆ ప్రాంతానికి వెళ్లరాదని, ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి చేరుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాన్ అక్టోబర్ 31వ తేదీ గురువారం మరింత తీవ్రవైన తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. లక్ష ద్వీప్ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర - వాయువ్య దిశగా మహా తుఫాన్ పయనిస్తోంది. వచ్చే 12 గంటల్లో లక్ష ద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరించించింది. తాజాగా ఇది ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.

కకావికలమైన కేరళ

అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తీవ్ర తుఫాను కేరళలోని కొచ్చి పట్టణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతన్న అలలకు తోడు తీవ్రంగా వీస్తున్న గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడికి తీరం పూర్తిగా దెబ్బతింది. తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాను పెను తుఫానుగా మారే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

తల్లడిల్లుతున్న తమిళనాడు

తమిళనాడులో మహా తుఫాన్‌  తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తుఫాన్ ధాటికి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్‌, తిరునల్వేలి, రామనాథపురం, సేలం, కన్యాకుమారి, తూత్తూకుడి భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై భారీగా నీరు చేరింది. మహా తుపాను గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలి  ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో జలపాతాలను మూసివేశారు. నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిపడ్డాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తమిళనాడు ప్రభుత్వం తరలించింది.

కర్ణాటకపై కన్నెర్రజేసిన క్యార్, పొంచి ఉన్న మహా ముప్పు

కర్ణాటక తీర ప్రాంతాల్లో క్యార్ దెబ్బకు భారీ వర్షాలు నమోదవుతున్నాయి.  క్యార్ తుఫాన్ జనజీవనంపై పెను ప్రభావం చూపిస్తోంది. కేరళ - కర్ణాటక తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతారణ అధికారులు సూచించారు. ఇక మహా తుపాన్ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నార. నేవీ సిబ్బంది బోట్ల సహాయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.