Saudi Arabia Bus Accident: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం, 35 మంది మృతి, మృతుల్లో అందరూ విదేశీ యాత్రికులే, బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు...

Bus Crash in Medina, Saudi. | (Photo Credit: Twitter)

Riyadh, October 17:  సౌదీ అరేబియా దేశంలోని ముస్లింల పవిత్ర నగరమైన మదీనా (Madena) సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారని సౌదీ రాష్ట్ర మీడియా గురువారం తెలిపింది.యాత్రికులతో వెళుతున్న ప్రైవేట్ చార్టర్డ్ బస్సు, మరో భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అయ్యి చాలా మంది అక్కడిక్కడే మరణించారని మదీనా పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా ఏసియా మరియు అరబ్ పౌరులు ఉన్నట్లు చెబుతున్నారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం, బస్సు ఢీకొనగానే అందులో మంటలు చెలరేగాయి, బస్సు కిటికీలు ఒక్కసారిగా పగిలిపోయి చెల్లాచెదురుగా విసిరివేయబడ్డాయి. అందులోని యాత్రికుల ఆర్తనాదాలు వినిపించాయని తెలిపింది. క్షతగాత్రులను అల్-హమ్నా ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

చమురు-ఆధారిత ఆర్థిక వ్యవస్థ గల సౌదీ అరేబియా, వైవిధ్యత కోసం పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంపై ఇటీవలే దృష్టిపెట్టింది.

గత నెల వరకు, ఈ అరబ్ దేశం కేవలం ముస్లిం యాత్రికులను, పనిచేసేందుకు వచ్చే కార్మికులకు మరియు క్రీడలు లేదా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చే విదేశీయులకు మాత్రమే వీసాలు జారీ చేసింది, అయితే తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేవలం ఇంధనంపైనే కాకుండా ఏడాది పొడవునా యాత్రికులు వచ్చేలా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పుడు అందరికీ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది.

పవిత్ర పుణ్యక్షేతం మక్కా సమీపంలో జరిగిన ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.