Red Alert for Hyderabad: హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌, ఇళ్ల నుంచి బయటకు వస్తే కొట్టుకుపోతారు, అత్యవసరైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Hyderabad Rains (Photo-Twitter)

Hyd, Sep 5: హైదరాబాద్‌ నగరాన్ని అర్థరాత్రి నుంచి కుంభవృష్టి ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో హైదరాబాద్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైనా సమస్య ఎదురైతే సాయం కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04-21111111, డయల్ 100, కంట్రోల్‌ రూమ్‌ 9000113667 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరో మూడు గంటల పాటు భారీ వర్షం కొనసాగవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులను అధికారులు సూచించారు.రాత్రి నుంచి కురిసిన వర్షంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. సెల్లార్లు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్‌ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ 4 గేట్లు ఎత్తివేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వాన, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచన, రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

భారీవర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా, రోడ్లపై నీరు నిలిచిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలన్నారు. హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌, వాటర్‌ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.

Here's Videos

నగర మేయర్‌ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్‌ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్‌, జీహెచ్‌ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పంజాగుట్ట వద్ద భారీగా వరద, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు, వీడియో ఇదిగో..

ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు ప్రాంతానికి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 1763.50 ఫీట్లు. ప్రస్తుతం 1763.20 ఫీట్లకు చేరుకుంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు ఆదేశించారు.

Here's Rain Videos

ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్‌ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది.

పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనదారులు అవస్థలు పడ్డారు. అమీర్‌పేటలోని మైత్రీవనం, మూసాపేట మెట్రోస్టేషన్‌ వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్‌హోళ్లలో చెత్త పేరుకుపోవడంతో వరదనీరు దిగువకు వెళ్లడం లేదు. వరదనీరు కారణంగా పలు చోట్ల ఒకే మార్గంలో రాకపోకలను అనుమతించారు. మరోవైపు బేగంపేట-సికింద్రాబాద్‌ మార్గంలోనూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Hyderabad Rain Videos

ఉమ్మడి నిజామాబాద్‌ (Nizamabad) జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు (Sriram sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద (Floods) వస్తుంది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉన్నది.

భారీ వర్షాల వేళ రాచకొండ పోలీసుల సూచనలు

భారీ వర్షాల నేపథ్యంలో సిటీ వాసులకు రాచకొండ పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ దరిదాపుల్లోకి పిల్లలను వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. వర్షంలో ఆడుకోవడానికి పంపించవద్దని చెప్పారు. ఇంట్లో విద్యుత్ పరికరాలు, బయట ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు. చెరువులు, మురుగు కాలువలకు సమీపంలో వెళ్లనివ్వకూడదని చెప్పారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాచకొండ పోలీసులు ప్రజలకు సూచించారు. నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, కిందపడ్డ కరెంట్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పాత గోడలకు దగ్గర్లో, చెట్ల కింద నిలబడ వద్దని చెప్పారు. అత్యవసర సందర్భాలలో బయటకు వస్తే రోజూ మీరు వెళ్లే దారిలోనే వెళ్లాలని, దగ్గరనో మరే కారణంతోనో కొత్తదారిలో వెళ్లొద్దని హెచ్చరించారు. రోజూ వెళ్లే తోవలో ఎక్కడ ఏం ఉంటుందనేది తెలిసి ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని తెలిపారు. అత్యవసర సందర్భాలలో సాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif