Cyclone Mandous: తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్
ప్రస్తుతానికి చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) తెలిపింది. శుక్రవారం తీరం దాటొచ్చని, ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Vijayawada, Dec 9: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్ (Cyclone Mandous).. ప్రస్తుతానికి చెన్నైకి (Chennai) 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ-IMD) తెలిపింది. శుక్రవారం తీరం దాటొచ్చని, ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ (Cyclone) కదులుతోంది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) (Sri Lanka) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వచ్చే 6 గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనం పడనుందని ఐఎండీ వెల్లడించింది.
ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ తెలిపింది.
ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా రహదారులకు కానీ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థకు కానీ ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.