IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

Hyderabad Rains (Photo-Twitter)

దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. సాధారణంగా దేశంలో జులై నుంచి నవంబరు వరకు తుపానులకు అనువైన సీజన్ గా భావిస్తారు.

ఈ సమయంలో తొలుత నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు తుపానులకు అవసరమైన బలాన్ని అందిస్తాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచన

ఇది జులై 25 నాటికి అల్పపీడనంగా మారుతుందని, జులై 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. ఇది క్రమేపీ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి పయనిస్తుందని పేర్కొంది. ఈ మేరకు గత అప్ డేట్ ను ఐఎండీ సవరించింది. తాజా బులెటిన్ ప్రకారం... ఈ నెల 24 నుంచి 28 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉత్తరాంధ్ర జిల్లా­లకు భారీ వర్ష ముప్పు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ

ఈ నెల 24 నుంచి 26 వరకు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ముఖ్యంగా, జులై 25న కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో జులై 25 నుంచి 27 వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వివరించింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.

25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌‌ను కుమ్మేసిన భారీ వర్షం, రాత్రికి ఇంకా కుండపోతగా కురిసే అవకాశం, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

ఇక హైదరాబాద్‌లో మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111, 9000113667కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది.

కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట, రామ్ నగర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. అబ్దుల్లాపూర్ మెట్ నుండి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో ద్విచక్రవాహనదారులు వంతెనల కింద తలదాచుకున్నారు.