Amaravati, July 24: ఏపీ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణులు ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతోపాటు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
వీటి ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 11.3 సెం.మీ, విశాఖపట్నం మధురవాడలో 10.6 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది.