PAN-Aadhaar Linking Deadline: నేటితో ముగియనున్న పాన్-ఆధార్ లింక్ గడువు, చేయకపోతే రూ.1000 ఫైన్, చెల్లని పాన్ వాడితే రూ.10వేలు కట్టాల్సిందే! పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం చాలా ఈజీ
పాన్ కార్డు (Pan card)కలిగి ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ సంఖ్యతో (Aadhaar) అనుసంధానం చేయాల్సిందే. దీనికి ఇవాల్టితో (మార్చి 31, 2022) గడువు ముగియనుంది. ఆ తర్వాత రూ.500-1000 వరకు జరిమానా (Fine) కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
New Delhi, March 31: పాన్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. పాన్ కార్డు (Pan card)కలిగి ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ సంఖ్యతో (Aadhaar) అనుసంధానం చేయాల్సిందే. దీనికి ఇవాల్టితో (మార్చి 31, 2022) గడువు ముగియనుంది. ఆ తర్వాత రూ.500-1000 వరకు జరిమానా (Fine) కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గడువు తర్వాతి మూడు నెలలు అంటే జూన్ 30, 2022 వరకు అనుసంధానం (Linking) చేసే వారు రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే మార్చి 31 తర్వాత ఆధార్‌తో(Aadhaar) అనుసంధానం చేయని పాన్‌లన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారతాయి. ఫైన్ చెల్లించి అనుసంధానం చేస్తేనే తిరిగి అవి పనిచేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం.. బ్యాంకింగ్, ఆన్‌లైన్ చెల్లింపులు, యూపీఐ(UPI), మొబైల్ బ్యాంకింగ్(Mobile Banking).. ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందే. లేదంటే ఈ సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండ్, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే ఛాన్సు కూడా ఉండదు.
ఆధార్ పాన్ లింకింగ్ కు (PAN-Aadhaar Linking) సంబంధించి ఇప్పటికే గడువు ముగిసినా.. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 31 వరకు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గడువును మరోమారు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చేసిన సీబీడీటీ.. 31లోగా ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేయని వారికి జరిమానా విధిస్తామంది. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయినా ఇంకా చాలామంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
గడువు లోగా పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తో లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 234H ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లని పాన్ కార్డ్ ఉపయోగించినట్టైతే రూ.10వేల జరిమానా చెల్లించాలి.
పాన్‌తో ఆధార్ అనుసంధానం ఇలా
పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి పాన్ కార్డ్ హోల్డర్లు ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి.
* ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి. తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
* ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది.
* ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ లింక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. New Message ఓపెన్ చేసి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపండి. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
పాన్‌తో ఆధార్ అనుసంధానం ఇలా కూడా చేసుకోవచ్చు
* ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.
* ఫస్ట్ టైమ్ లాగిన్ అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబరే (శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.
* యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
* ఆధార్-పాన్ లింక్ కోసం ఒక పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
* పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం కనిపిస్తుంది.
* స్క్రీన్‌పై కనిపిస్తున్న పాన్ కార్డు వివరాలను ఆధార్‌లో పేర్కొన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివరాలలో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.
* వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి “ లింక్ నౌ ” బటన్ పై క్లిక్ చేయండి.
* మీ ఆధార్, పాన్‌తో విజయవంతంగా లింక్ అయినట్లు పాప్-అప్ విండోతో సందేశం వస్తుంది.
* https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఆధార్, పాన్‌లను లింక్ చేసుకోవచ్చు.