New Delhi, June 24: ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది. మీ పాన్ కార్డ్ పనిచేయాలంటే వెంటనే మీ ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి. సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.
అంటే పాన్ కార్డు ఉన్నా లేనట్లే అవుతుందని గతంలోనే ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా వీలుకాదని హెచ్చరించింది. అంతేకాదు ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేయకపోతే ఆర్ధిక లావాదేవీలు జరపలేరని కూడా గతంలోనే వార్నింగ్ ఇచ్చింది. డాక్యుమెంట్లలో లోపాల వల్లనో లేక మరే ఇతర సాంకేతిక కారణాల వల్లనో చివరి నిమిషంలో అనుసంధానం చేయలేకపోయినవారికి ఆదాయ పన్నుశాఖ మరోసారి అవకాశం ఇచ్చింది. 2021 మార్చి 31వ తేదీలోగా అనుసంధానం పూర్తి చేయాలని అవకాశం ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఆధార్ కార్డును పాన్ కార్డుతో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో ఆధార్- పాన్ జతచేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
1) ఐటీ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి, ఎడమ వైపు "Link Aadhar" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. (https://www.incometaxindiaefiling.gov.in/home)
2) ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, మీ పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేసి ఎంటర్ చేయాలి.
3) ఆ తర్వాత మీరు ఇచ్చిన వివరాలన్ని సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చూసుకొని సబ్‌మిట్ చేయాలి.
4) ఒకవేళ మీరు ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఆధార్ తో జత చేసిన మీ నెంబర్ కు OTP వస్తుంది, దాని ప్రకారంగా తిరిగి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి పరిష్కరించుకోవచ్చు.
మరో మార్గం ద్వారా..
ఒకవేళ మీకు ఆన్‌లైన్ సదుపాయం లేనట్లయితే మీ ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపడం ద్వారా కూడా ఆధార్ -పాన్ లింక్ చేయవచ్చు. అయితే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేయబడిన ఫోన్ నెంబర్ తో మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుంటుంది. మెసేజ్ ఎలా చేయాలో కింద చూడండి.
1) మెసేజ్ లోకి వెళ్లి UIDPAN అని టైప్ చేసి దాని పక్కనే మీ 12 అంకెల ఆధార్ నెంబర్, దాని పక్కనే మీ 10 అంకెల పాన్ కార్డు నెంబర్ ను టైప్ చేయాలి
ఉదాహారణకు మీ ఆధార్ నెంబర్ 546738291083, పాన్ కార్డ్ నెంబర్ EFGH11234M అనుకుంటే, ఈ రకంగా UIDPAN 546738291083 EFGH11234M అని టైప్ చేయాలి.
2) ఆ తర్వాత 567678 లేదా 56161 ఏదో ఒక నెంబర్ కు మీ మెసేజ్ పంపండి.
3) మెసేజ్ పంపిన తర్వాత మీకు అక్కడ్నించి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ITR ఫైల్ చేయాలన్నా ఈ ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లింక్ తప్పనిసరి చేశారు.