Representational Image | Credits: PTI

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (2019 Budget) లో భాగంగా పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్ (PAN - Aadhar) నిబంధనల్లో మార్పులు చేశారు. అయితే ఆ మార్పులకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

గతంలో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు కేవలం ఆధార్ కార్డు ఉన్నాసరే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.

పాన్ కార్డ్ లేనివారు ఎవరైతే ఆధార్ కార్డుతో రిటర్నులు సమర్పిస్తారో వారి ఆధార్ వివరాల ఆధారంగా ఇన్ కాం టాక్స్ అధికారులే వారికి కొత పాన్ కార్డును జారీచేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (Central Board of Direct Taxes) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తెలిపారు.

అలాగే బ్యాంకుల్లో రూ. 50 వేల దాటిన లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి అనే నిబంధను కూడా సడలించారు. కాబట్టి ఇకపై బ్యాంకుల్లో రూ. 50 వేలకు పైబడి లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. రూ. 50 వేల క్యాష్ విత్ డ్రాకు సైతం ఆధార్ కార్డ్ ఉంటే చాలు.

ఆధార్ కార్డ్ - పాన్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి అనే నిబంధనను సైతం తాజాగా ఎత్తివేశారు. ఆధార్ - పాన్ లింక్ చేసుకోకపోయినా పాన్ కార్డ్ పనిచేస్తుంది.

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్, బంగారం కొనుగోలు ఇతర అన్ని రకాల ఆర్థిక సంబధమైన వ్యవహారాలకు కూడా ఆధార్ కార్డ్ ఉంటే చాలు.

అయితే దీని ఉద్దేశ్యం పాన్ కార్డ్ అవసరం ఇక లేదని కాదు, దేశంలో 120 కోట్ల మంది ఆధార్ కార్డ్ కలిగి ఉన్నారు, కేవలం 42 కోట్ల మంది పాన్ కార్డ్ కలిగి ఉన్నారు. కాబట్టి పన్ను చెల్లింపుదారులకు ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ పరస్పర మార్పిడికి ఇది ఉపయోగపడుతుంది. ఏయే చోట పాన్ కార్డ్ అవసరమవుతుందో ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకుంటే దాని స్థానంలో ఆధార్ నెంబర్ వివరాలు ఇస్తే చాలు. దాని ఆధారంగానే వారికి మళ్ళీ పాన్ కార్డ్ జారీ చేయబడుతుంది. అంతేకాకుండా నకిలీ పాన్ కార్డులు ఎవరైనా కలిగి ఉంటే ఈ ఆధార్ కార్డ్ వివరాల ద్వారా నకిలీలను గుర్తించే వీలుంటుందని కేంద్ర ఐటీ అధికారులు తెలిపారు.